ఇందిర‌మ్మ ఇళ్ల స్థ‌లం.. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు..!

by Ratna Kumari |   (  Updated:2025-10-24 15:44:01  IST  )

దిశ, కామారెడ్డి : ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి భూముల రికార్డులు తారుమారావుతూనే ఉన్నాయి. ఒకరికి తెలియకుండా మరొకరి పేరిట పట్టాలు

ఇందిర‌మ్మ ఇళ్ల స్థ‌లం.. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు..!
X

దిశ, కామారెడ్డి : ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి భూముల రికార్డులు తారుమారావుతూనే ఉన్నాయి. ఒకరికి తెలియకుండా మరొకరి పేరిట పట్టాలు మార్పిడి అయ్యాయి. తాజాగా 40 ఏళ్ల కిందట ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల స్థలాన్ని రెవెన్యూ రికార్డులో పట్టాగా ఉండటంతో ఇతరులకు బదలాయింపు చేసుకున్నారు. ఈ విషయం సంబంధిత ఇందిరమ్మ లబ్దిదారులకు తెలియకుండానే జరగడం, ఆ స్థలంపై ఏకంగా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్టు తెలియడంతో అవాక్కయ్యారు. దళితులకు చెందిన ఇందిరమ్మ ఇండ్లు కావడంతో అధికారులు ఎలా స్పందిస్తారోనన్న చర్చ సాగుతోంది.

పంచాయతీ రికార్డులో ఇందిరమ్మ కాలనీ

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో 136 సర్వే నంబరులో 2.26 ఎకరాల పట్టా స్థలంలో కొంత భూమిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు కేటాయించింది. ఇందులో సుమారు 25 మంది దళితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమి పంచాయతీ రికార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల కాలనీగా ఉంది. రెవిన్యూ రికార్డుకు మాత్రం పట్టా భూమిగానే ఉండిపోయింది. అయితే ఆ భూమి ఎవరి పేరుమీద లేదని, తమకు మాత్రమే ఉంటుందని దళితులు భావిస్తూ వస్తున్నారు.

రెండేళ్ల కిందట పట్టా మార్పిడి

గ్రామంలో దళితులకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల స్థలం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సుమారు ఎకరంకు పైగా భూమి 2022 లో ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా బయటకు పొక్కింది. పైగా ఆ భూమిపై ఓ బ్యాంకులో రుణం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం దళితులకు తెలియడంతో మా ఇళ్ల స్థలాన్ని కబ్జా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లపై రైతుబంధు

40 ఏళ్లుగా ఆ గ్రామ దళితులు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లలోనే నివాసం ఉంటున్నారు. గ్రామ పంచాయతీలో దళితుల లబ్ధిదారుల పేరిట ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీడు భూములకు, సాగుకు పనికి రాని, ఇళ్ల స్థలాలు గల భూములకు రైతుబందు నిలిపివేసింది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్థలంపై కూడా గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి రైతుబందు తీసుకున్నట్టుగా తేలింది. సంబంధిత 136 సర్వే నంబరుకు రైతుబంధు నిలిపివేస్తున్నామని అధికారులు గ్రామంలో నోటీసులు జారీ చేయడంతో అసలు విషయం బయటకు పొక్కింది.

ఇందిరమ్మ ఇండ్ల స్థలంపై రుణం

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్థలం మార్పిడి చేయడంతో అక్కడితో ఆగిపోలేదు. ఆ భూమిపై ఓ బ్యాంకులో మార్ట్ గేజ్ చేసుకుని లక్షల రూపాయలు రుణం కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారులు ఈ విషయం తెలిసి ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇండ్లను కబ్జా చేసారని, ఆ ఇండ్లపై రుణం తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టా మార్పిడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, రైతుబంధు, బ్యాంకు రుణం వారి నుంచి రికవరీ చేయాలని అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ అంశం గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Next Story