- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైసెన్స్ లేని రెస్టారెంట్లు: కల్తీ నూనెలతో ఆహారం
మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిఠాయి దుకాణాలు తప్పకుండా అధికారుల అనుమతితోనే ఏర్పాటు చేయాలి.

దిశ కామారెడ్డి : ఆదాయమే పరమావధిగా జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్స్ షాపులు పుట్టగొడుగుళ్లా పుట్టుకొస్తున్నాయి. చాలా చోట్ల నిబంధనలు, అనుమతులు లేకుండానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆహారభద్రతాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పలువురు నిర్వాహకులు నాసిరకమైన వస్తువులను వంటకాల్లో వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఓ హోటల్ ఏర్పాటు చేయాలంటే ఆహారభద్రతశాఖ జారీ చేసే ఫుడ్ లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలి. జిల్లాలో చాలా హోటల్ నిర్వాహకులు వీటిని పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని హోటళ్లలో తీసుకున్న ఆహార పదార్థాలకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో వేల సంఖ్యలోనే హోటళ్లు, బేకరీలు, స్వీట్స్ షాపులు, రెస్టారెంట్లు ఉన్నా, లైసెన్సులు మాత్రం వందల సంఖ్యకే ఉన్నట్లు సమాచారం.
మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసే హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందిన తర్వాతనే ఏర్పాటు చేయాల్సి ఉండగా నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. ఇప్పటివరకు ఉన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా చాలావరకు మున్సిపల్ అనుమతులు లేకుండానే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతోనే వ్యాపారులు ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిఠాయి దుకాణాలు తప్పకుండా అధికారుల అనుమతితోనే ఏర్పాటు చేయాలి. అయితే నిర్వాహకులు మాత్రం తమను అడిగే వారు ఎవరనే భరోసాతో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
శుచి, శుభ్రత కరువే...
బడా, చోటా మోటా వ్యాపారులు ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో నాణ్యత మాట దేవుడెరుగు. కనీసం శుచి శుభ్రతను కూడా పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
కల్తీ నూనెలు, పదార్థాల వాడకం
హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు, కల్తీ ఆహార పదార్థాలను వాడుతూ వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటు మునిసిపాలిటీ అధికారులతో పాటు అటు ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారుల తనిఖీలు అంతంత మాత్రమే ఉండడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల, హోటళ్ల నిర్వాహకుల కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. కల్తీ వంట నూనెలతోపాటు టెస్టింగ్ పౌడర్, తదితర పదార్థాలను కూడా వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.
కొరవడిన నిఘా, తనిఖీలు
హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపాలిటీకి చెందిన శానిటేషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ ఆహార పదార్థాలతో పాటు శుభ్రత పాటించని హోటళ్ల పై కేసులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తే నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందుతుండేవని భావిస్తున్నారు. అయితే ఇవేమీ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం వల్లనే వ్యాపారుల కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోయింది.
అడపాదడపా తనిఖీలు..
జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు చుట్టుపక్కల మండల కేంద్రాల్లో ఉన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎప్పుడో ఒకసారి చుక్క తెగిపడినట్లుగా లేదా అధికారులకు గుర్తుకు వచ్చినప్పుడు తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారే తప్ప.. వారిపై కేసులు నమోదు చేయడం, భారీ ఎత్తున జరిమానాలు విధించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అనుమతులు లేకుండా హోటళ్లు ఏర్పాటు చేయరాదు - రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హోటళ్లలో శుభ్రత పాటించకుంటే వాటిపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం.






