నిజామాబాద్ లో హనీ ట్రాప్..!

by Ratna Kumari |

ఈజీ మనీ కోసం యువకులకు వలపు వలన ఎరవేసి, హనీ ట్రాప్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం కలకలం రేపింది.

నిజామాబాద్ లో హనీ ట్రాప్..!
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మనుషులు అడ్డదారులు వెతుకుతున్నారు. జల్సాల కోసం కొందరు యువకులు, ఏ ఉద్యోగం లేక ఆర్థిక అవసరాల కోసం మరికొందరు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ల వంటి నేరాలకు పాల్పడుతుంటే.. కొంతమంది మహిళలు, కాలేజీ విద్యార్థినుల ఆర్థిక అవసరాలను అడ్డం పెట్టుకుని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. తాజాగా ఈజీ మనీ కోసం యువకులకు వలపు వలన ఎరవేసి, హనీ ట్రాప్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం కలకలం రేపింది.
రెక్కల కష్టం లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు హానీ ట్రాప్ దందా మొదలు పెట్టారు. రోడ్డున పోయే వారిని లిఫ్ట్​ అడగడం, నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళగానే లిఫ్ట్ ఇచ్చిన వారిని ఆపి బెదిరించి బలవంతంగా డబ్బులు దోచుకోవడం వంటివి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈజీగా డబ్బులు సంపాదించడానికి భార్యా భర్తలిద్దరూ ఓ పథకం వేశారు. బైక్ పై వెళ్తున్న‌ వారిని టార్గెట్ గా చేసి ముందుగా మహిళ లిఫ్ట్ అడుగుతుంది. సానుభూతితో లిఫ్ట్ ఇవ్వగానే, వారి వెనకాలే ఆ మహిళ భర్త మరోబైక్ పై వీరిని అనుసరిస్తాడు.

నాందేడ్​కు చెందిన భార్యాభర్తలు..


రూరల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మథ్కేడ్​ తాలూకా ముక్రంబాద్​ గ్రామానికి చెందిన మంగేష్కర్​ గైక్వాడ్​, ఉజ్వల గైక్వాడ్ భార్యాభర్తలు. వీరు నగర శివారులోని మాధవనగర్​ ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వీరు హనీ ట్రాప్ దందాకు తెరలేపారు. ఉజ్వల గైక్వాడ్​ తన భర్తతో కలిసి రెండు నెలలుగా నగరంలోని కంఠేశ్వర్ బైపాస్, ఆర్మూర్​ రోడ్డులో నిలబడి ఒంటరిగా బైక్ ​పై వెళ్తున్న యువకులను, పురుషులను ఆకర్శించేలా నవ్వుతూ, సైగలు చేస్తూ ఆకర్షిస్తోంది. కళ్లెగరేస్తూ సైగలు చేసి దగ్గరికి పిలుస్తుంది. తన దగ్గరికొచ్చిన వారితో మాటామాటా కలిపి తను రేటు మాట్లాడుకుంటుంది. రేటు మాట్లాడుకొని, ఆవ్యక్తిని బైక్​పై ఎక్కి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఇవన్నీ దూరం నుంచి గమనిస్తున్న మహిళ భర్త మంగేష్కర్​ గైక్వాడ్​, వారిని ఫాలో అవుతూ వారి వెనకే వెళ్తాడు. వారికి అనుకూలంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళగానే ఆ వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

గ‌త కొద్ది నెలలుగా ఈ భార్యా భర్తలిద్దరూ ఇలాగే బైక్​పై వెళ్లేవారిని సెక్స్ ఆశగా చూపి ట్రాప్ చేస్తున్నారు. తనను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడని కేసు పెడ్తామని చెప్పి బెదిరించి డబ్బులు దండుకున్నారు. ఇప్పటికే ఈ దంపతుల వలలో చిక్కి మోసపోయిన వారిలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కొద్ది రోజుల క్రితం హానీ ట్రాప్ జంట పై నిఘావేసి నగర శివారులోని ఓ ప్రాంతంలో వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్యాభార్తలిద్దరూ తాము చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో నిందితులిద్ద‌రినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద వెపన్ కూడా లభ్యమైనట్టు తెలిసినప్పటికీ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు.

Next Story