- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bad Condition: రోడ్డు ఇలా.. ప్రయాణమెలా? అధ్వాన్నంగా హైవే, ప్రధాన, గ్రామీణ రోడ్లు..!
హైవే, ప్రధాన, గ్రామీణ రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. అడుగుకో గుంతలతో అధ్వాన్నంగా మారాయి.

హైవే, ప్రధాన, గ్రామీణ రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. అడుగుకో గుంతలతో అధ్వాన్నంగా మారాయి. కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితికి చేరాయి. ఇక ద్విచక్ర వాహనదారులు, పెద్ద వాహనాలపై రాకపోకలు చేసేవారికి నరకం చూపిస్తున్నాయి. రోజూ పలు రోడ్లపై ప్రమాదాలు జరుగుతూ వాహనచోదకులు గాయాలపాలవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్ల మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు అధ్వాన్నంగా మారి, వాహనాలు తిరగడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. లక్షలకు లక్షలు ఖర్చు చేసి వేసిన రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతున్నాయి. రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉండడంతో వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి తారు రోడ్లు మరింతగా దెబ్బతింటున్నాయి.
దిశ, బోధన్ : ప్రజాకర్షక పథకాల పేరు చెప్పి ఓటర్లను నమ్మించి, వాటి హామీలతో పునాదుల మీద అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచిపోతున్నాయి. కనీసం ప్రజల రాకపోకలకు, ఇబ్బందులు కలగకుండా రోడ్డు సౌకర్యాలను మెరుగు పరచాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రజల ఓట్లతో గెలుపొంది అధికారాన్ని అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులైతే రోడ్లు బాగు చేయడం తమ పరిధిలోకి రాదన్నట్లే వ్యవహరిస్తున్నారు. రోడ్లు ఎలా ఉన్నా ప్రయాణించేందుకు జనాలు అలవాటు పడ్డారులే అనే నిర్లక్ష్యం భావం ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తోంది.ఒంటి పై చెమట పట్టకుండా, కడుపులో చల్ల కదలకుండా ప్రయాణించేందుకు ఖరీదైన కార్లలో తిరిగే ప్రజాప్రతినిధులకు గతుకుల రోడ్లపై అవస్‌థలు పడుతూ అసౌకర్యంగా ప్రయాణించే జనాల కష్టాలను చూసే ఓపిక సోయి లేకుండా పోయిందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవలే కమ్మర్ పల్లి మండల పరిధిలో రోడ్డు బాగా లేక ఆటో బోల్తాపడి ఆటోలో ప్రయాణిస్తున్న ఐదారుగురుమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఇటీవల ఓ ఇద్దరు మోటార్ సైక్లిస్టులు సారంగాపూర్ నుండి అర్సపల్లి మధ్యలో గతుకుల రోడ్డుపై ప్రమాదానికి గురి కాగా ఒకరికి ఎడమ కాలి తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. చికిత్స కోసం దాదాపు రూ. 2.50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరో వ్యక్తి తన భార్యతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఇదే రోడ్డుపై ప్రమాదానికి గురి కావడంతో బైక్ వెనక కూర్చున్న వ్యక్తి భార్య తలకు తీవ్ర గాయాలవడంతో దాదాపు నాలుగు గంటలు స్పృహ కోల్పోయి ఆస్పత్రి పాలైంది. ఇంకా వెలుగులోకి రాని ప్రమాదాలెన్నో ఉన్నాయి. ఇదే రోడ్డు వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు వెళుతున్నా వారికి ఈ రోడ్డు దుస్థితి కనిపించకుండా ఉండదంటే ఎవరూ నమ్మని పరిస్థితి. మరి రోడ్డు దుస్థితి ఇంత దారుణంగా ఉన్నా మరెందుకు కనీసం మరమ్మతులు కూడా చేయించడం లేదనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేకు తన పదవి పై ఉన్న శ్రద్ధ ప్రజల అవస్థలపై, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించే ఓపిక కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.






