బీసీ రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే.. ఓసీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..!

by Ratna Kumari |

దిశ, నాగిరెడ్డిపేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్ల (జీవో 9) అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు

బీసీ రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే.. ఓసీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..!
X

దిశ, నాగిరెడ్డిపేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్ల (జీవో 9) అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ తీర్పు పై అఖిల భారత ఓసీ సంఘం జాతీయ అధ్యక్షుడు పెంజర్ల మహేందర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అందులో రాష్ట్ర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలను ఉద్దేశించి ఉపయోగించిన అభ్యంతరకరమైన పదజాలంతో సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టిన పోస్ట్ పెద్ద వివాదానికి దారితీసింది. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

హై కోర్టు స్టే.. ఓసీ నేత స్పంద‌న

తెలంగాణ హైకోర్టు రిజర్వేషన్ల జీవోపై స్టే విధించడాన్ని పెంజర్ల మహేందర్ రెడ్డి గొప్ప విజయంగా ప్రకటించారు. ఈ విజయం వెనుక తమ పోరాటమే 100% ఉందని.. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని తాము మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ రామకృష్ణారెడ్డి బృందంతో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మీడియా పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. జ‌ర్న‌లిస్టుల ఆగ్ర‌హం

ఓసీ సంఘం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తన ప్రకటనలో ఈ అంశంపై గతంలో మాట్లాడిన ఇతర కుల సంఘాల నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి అత్యంత తీవ్రమైన అభ్యంతరకరమైన బూతు పదజాలాన్ని ఉపయోగించారు. మీడియాను ఉద్దేశించి బాధ్యతారహితంగా మాట్లాడిన ఆయన తీరు పై జర్నలిస్టు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం మవుతోంది. ఓసీ సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని మీడియా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. పెంజ‌ర్ల మ‌హేంద‌ర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జర్నలిస్టులు, మీడియా సంఘాలు ఏకమై నిరసన వ్యక్తం చేయాలని, పెంజర్ల మహేందర్ రెడ్డిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రముఖ జర్నలిస్టులు, సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అభ్యంతరకర పదజాలం వాడినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.

Next Story