మద్దతు ధరకు బోనస్ కలిపి ధాన్యం కొనుగోలు చెయ్యాలి

by Disha Web Desk 15 |
మద్దతు ధరకు బోనస్ కలిపి  ధాన్యం కొనుగోలు చెయ్యాలి
X

దిశ, భీంగల్ : గత ఎన్నికల్లో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతికొచ్చిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు బోనస్ రూ.500 కలిపి కొనుగులు చెయ్యాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భీంగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు పోరుబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో ప్రజల, రైతుల ఆశలను అడియాశలు చేశారన్నారు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్, సమయానికి రైతు బంధు, కావాల్సినంత సాగునీరు, రైతు బీమాను ఇచ్చి పండించిన పంటను కొనుగోలు చేశారని అన్నారు. ఎద్దు ఏడ్చిన ఎగసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అన్న చందంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తయారైందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 21 ప్యాకేజీ ద్వారా నీటిని కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చి వాగులు నింపామని, ఎస్సారెస్పీ నింపామని అన్నారు. వాగులు నింపాలని రైతులు రోడ్డు ఎక్కినా స్థానికంగా పట్టించుకున్న కాంగ్రెస్ నాయకులే లేరన్నారు. ప్రజలను, రైతులను పట్టించుకోకపోగా నియోజవర్గంలోని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు వాగులు, ఒర్రెలు, చెరువులు, ఆఫీసులు పంచుకొని దోచుకొంటున్నారని ఆరోపించారు. ఇసుక, మట్టి అమ్ముకోవడం, ఆఫీసుల్లో ఫైరవీలు చేయడం పై ఉన్న శ్రద్ధ రైతులు, ప్రజల సమస్యలపై లేదన్నారు. ప్రభుత్వ వనరులను దోచుకొమ్మని అనుచరులను వదిలిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. గ్రామాలను దోచి మండలాలకు, మండలాలను దోచి జిల్లాలకు, జిల్లాలను దోచి రాష్ట్రం కు, రాష్ట్రం ను దోచి హై కామండ్ కు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ పని అన్నారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మొత్తం 420 హామీలను అమలు చేస్తానని గత ఎన్నికల్లో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీని నేరవర్చలేక పొయ్యారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు లేదన్నారు. రుణమాఫీ రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి అమలు చెయ్యలేదని, కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదని, సాగునీరు ఇవ్వడం చేతగాలేదన్నారు. రుణాలు తీసుకొన్న రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన

హామీలు ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు అమలు చేయకపోతే ప్రయోజనం లేదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందే హామీలు అమలు అయ్యేలా రైతులు, ప్రజలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని, వారిపై కలిసి కట్టుగా ఒత్తిడి తేవాలని సూచించారు. అందుకు అన్ని గ్రామాల్లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులకు, ప్రజలకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు. వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వెయ్యవద్దని కోరారు. ఈ పోరుబాట కార్యక్రమంలో బీంగల్, మోర్తాడ్, కమ్మరపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed