Government Schemes: అర్హులెవరు.. అనర్హులెవరు..?!

by Ramesh Goud |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారుల ఎంపిక కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు.

Government Schemes: అర్హులెవరు.. అనర్హులెవరు..?!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారుల ఎంపిక కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలు ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. గ్రామాల్లో గ్రామపంచాయతీల వారీగా, మున్సిపల్ పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో వార్డుల వారీగా గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి అధికారులు గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించి లబ్దిదారులను పారదర్శకంగా ప్రజల సమక్షంలోనే ఎంపిక చేయనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు కొద్ది రోజులుగా సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. లబ్దిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకతను పాటించాలని, ప్రజల సమక్షంలో ఎలాంటి అభ్యంతరాలు ఎదురైనా వాటిపై గ్రామ సభల్లోనే చర్చించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్లు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ గ్రామసభలు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి.

అందరిలో టెన్షన్..

ఈనెల 26 నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరెవరిని లబ్దిదారులుగా గుర్తిస్తారో, ఎవరెవరిని రిజెక్ట్ చేస్తారో.. గ్రామ సభల్లో ఎంపిక చేసే లబ్దిదారుల జాబితాలో తమకు చోటు దక్కుతుందో లేదోననే టెన్షన్ ప్రజల్లో, రైతుల్లో ఉంది. మరో పక్క గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక చేసే క్రమంలో ప్రజలు తమపై ఎలా రియాక్ట్ అవుతారోనని అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈనెల 16 నుంచి 20 వరకు జరిగిన సర్వేలో లబ్దిదారుల జాబితాలో తమ పేర్లు రాలేదని, పుట్టినప్పటి నుంచి గ్రామంలో ఉన్న వారి పేర్లు కాకుండా, ఎక్కడి నుంచో ఉపాధి కోసం ఇటీవలే వచ్చి కూలీ పని చేసుకునే వారి పేర్లు కూడా జాబితాలో వచ్చాయని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా ప్రజల నుంచి అధికారులు నిలదీతలు ఎదుర్కొన్నారు. సర్వే సమయంలోనే ప్రజలకు సర్ది చెప్పలేక తలలు పట్టుకున్న అధికారులు వందల సంఖ్యలో ప్రజలు హౄజరయ్యే గ్రామ సభల్లో ఎవరెలా స్పందిస్తారో.. ఎవరికెలా సమాధానం చెప్పాలో అర్ధం కాక తలలు పట్టుకునే పరిస్థితులెదురవుతాయేమోననే అందోళన అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

చక్రం తిప్పేందుకు లీడర్ల వ్యూహాలు..

లబ్ధిదారుల ఎంపికలో పక్కాగా అర్హులకే చోటు దక్కేలా చూడాలని, అనర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు లేకుండా గ్రామసభల్లోనే నిర్ణయించేలా చూడాలని ఉన్నతాధికారులు గ్రామసభల్లో పాల్గొనే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అయినప్పటికీ గ్రామంలో మాజీలు, తాజా మాజీలు, వీడీసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తమ ప్రాభాల్యాన్ని చాటుకునేందుకు గ్రామసభల్లో హాజరై తమ అనుయాయులకు, అనుచరులకు లబ్దిదారుల జాబితాలో చోటు దక్కేలా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న గ్రామసభలు నేపథ్యంలో గ్రామ, మండల స్థాయి అధికారులను సోమవారమే కలుసుకుని తమకు సహకరించాలని, లబ్దిదారుల ఎంపికలో తమ ప్రపోజల్స్ కు ప్రాధాన్యమివ్వాలని కోరినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపించుకోవాలంటే లబ్దిదారుల ఎంపికలో అధికారులు తమకు సహకరించాలని, అందుకు తగ్గ ప్రతి ఫలాన్ని ఏదో రూపకంగా ముట్ట జెప్పుకుంటామని లీడర్లు అధికారులకు భరోసాను కూడా ఇచ్చినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డి మండలాలు, నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ మండలాల్లో, నిజామాబాద్ జిల్లా బోధన్, బాల్కొండ మండలాల్లో కూడా కొందరు లీడర్లు అధికారులను కలిసి లబ్దిదారుల ఎంపికలో తమకు సహకరించాలని కోరగా అధికారులు లీడర్లను సుతి మెత్తగా హెచ్చరించినట్లు తెలిసింది. అధికారులను కలిసిన లీడర్లలో ప్రధాన పార్టీల గ్రామ స్థాయి నాయకులున్నట్లు సమాచారం. గ్రామసభల్లో కూడా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించాలని చూస్తే చట్టపరంగా చర్యల కోసం సిఫారసు చేస్తామని గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

గ్రామసభల్లో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు..

నేటి నుంచి ప్రారంభమయ్యే గ్రామసభల్లో ప్రజలు కానీ, నాయకులు, ఫైరవీకారులెవరైనా అధికారులతో దురుసుగా వ్యవహరించినా, గ్రామసభలకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించినా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. సాఫీగా గ్రామసభలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా గ్రామసభల్లో ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు.

113 క్లస్టర్లుగా 530 గ్రామపంచాయతీలు..

నిజామాబాద్ జిల్లాలో గ్రామ సభల నిర్వహణకు అధికారులు పంచాయతీలను, మున్సిపాలిటీలను క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ల వారీగా టీం లను కూడా ఏర్పాటు చేశారు. ఈ టీంలు గ్రామసభలు నిర్వహించనున్నాయి.. నిజామాబాద్ జిల్లాలోని 31 మండలాల్లో 530 గ్రామ పంచాయతీలను గ్రామ సభల నిర్వహణ కోసం 113 క్లస్టర్లు గా విభజించారు. 113 అధికారుల బృందాలను గ్రామసభల కోసం నియమించారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లోని 146 వార్డులను 20 క్లస్టర్లుగా విభజించారు. గ్రామసభల నిర్వహణ కోసం 20 అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు.

ఏయే రోజు ఎన్ని చోట్ల గ్రామసభలు..

ఈనెల 21న 200 గ్రామ సభులు జరుగనున్నాయి. 160 గ్రామాల్లో, 40 వార్డుల్లో గ్రామసభలు జరుగనున్నాయి, 22న 199 గ్రామసభలు. గ్రామాల్లో 159 గ్రామాల్లో, 40 వార్డుల్లో.. 23 న 177 గ్రామసభలు జరుగనున్నాయి. 137 గ్రామాల్లో, 40 వార్డుల్లో గ్రామసభల నిర్వహిస్తున్నారు. గ్రామసభల్లో చివరి రోజు 24 తేదీన 96 గ్రామ సభల నిర్వహణ ఉంటుందని, 74 గ్రామాల్లో 26 వార్డుల్లో గ్రామసభలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Next Story