- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ చెత్త పారవేయకుండా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ సమీపంలో, గాయత్రీనగర్ లో ప్రధాన కూడళ్ళ వద్ద రోడ్ల పక్కన చెత్త పారవేయకుండా చేపట్టిన చర్యలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాలలోనే చెత్తను వేయాలని, రోడ్లపై చెత్త పారవేస్తే జరిమానాలు విధించబడతాయనే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు, మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన పెంపొందించాలని అన్నారు. పారిశుధ్య సమస్య నెలకొనకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించేలా చూడాలన్నారు.
మురుగు కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తూ, ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అవకాశం ఉన్న చోట జేసీబీ యంత్రాల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాలను శుభ్రం చేయించి, పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటించి వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ నాగారం శివారులోని డంపింగ్ యార్డును సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికీ తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ, ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభం అవుతుందని అన్నారు. వ్యర్ధాలను శుద్ధి చేస్తూ కంపోస్ట్ తయారీ కోసం ప్రతిపాదించిన మరో రెండు వేస్టేజ్ ప్రాసెస్సింగ్ యంత్రాలను సత్వరమే తెప్పించుకుని శుద్ధి ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చూడాలని కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటి కమిషనర్ రవిబాబు, ఇంచార్జి ఎంహెచ్ఓ సాజిద్ ఉన్నారు.






