తేలిన వంతెన.. సురక్షిత ప్రాంతానికి విద్యార్థినుల తరలింపు

by Nalla Sampath Reddy |

గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి నెలకొంది.

తేలిన వంతెన.. సురక్షిత ప్రాంతానికి విద్యార్థినుల తరలింపు
X

దిశ, నిజాంసాగర్ : గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి నెలకొంది. దీంతో ప్రాజెక్టు 27 వరద గేట్లను ఎత్తి నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు నీటి పారుదల శాఖ అధికారులు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు 12 వరద గేట్ల నుండి 10 గేట్లు ఎత్తి సుమారుగా 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో నిజాంసాగర్ సమీపంలో గల చిన్న ఫుల్ వంతెన పూర్తిగా మునిగిపోయింది. దీంతో వంతెనకు అటు వైపుగా ఉన్న జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయం, అచ్చంపేట్ ఆదర్శ పాఠశాలలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా 16 వరద గేట్ల నుండి నీటి విడుదల సైతం కొనసాగడంతో ఈ విద్యాలయాలు జల దిగ్భందానికి గురవ్వడంతో విద్యార్థులు గత మూడు రోజులుగా బిక్కు బిక్కు మంటూ గడిపారు.

శుక్రవారం ఉదయం వరద పోటు తగ్గడంతో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నిజాంసాగర్ చేరుకొని ఆదర్శ పాఠశాల 90 మంది విద్యార్థినులను కస్తురిబా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహానికి ప్రైవేటు బస్సు ఏర్పాటు చేసి తరలించారు.

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థినుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని కస్తురిబా గాంధీ విద్యాలయం నుండి విద్యార్థినులను తల్లి దండ్రులు విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, తహసిల్దార్ బిక్షపతి, ఎంపిడిఓ గంగాధర్, ప్రిన్సిపాల్ కార్తిక సంధ్య, మహమ్మద్ నగర్ ఎంఈఓ అమర్ సింగ్, ఎస్ఐ శివకుమార్, నాయకులు అనీస్ పటేల్, బంజారా సేవ సంఘం జనరల్ సెక్రటరీ విస్లావత్ గోపి నాయక్, బాన్సువాడ ఆర్డీవో కార్యాలయ టెక్నికల్ మేనేజర్ జగన్ గౌడ్, అజారుద్దీన్, అబ్దుల్ జమిల్, అయిటి రాజు, రాము రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story