మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు.. నేటితో ముగుస్తున్న గడువు!

by Malleboina Mahesh |

మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల్లో గడువు నేటితో ముగుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు.. నేటితో ముగుస్తున్న గడువు!
X

మొక్కజొన్న రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకుందామంటే సాంకేతిక అడ్డంకులు శాపంగా మారాయి. వేలిముద్రలు పడకపోవడంతో వృద్ధ రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఐరిష్ యంత్రాలు అందుబాటులో లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. నేటితో గడువు ముగుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ కష్టాన్ని దళారుల పాలు చేయొద్దని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే గడువు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో భారీగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దిశ, తాడ్వాయి : మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల్లో గడువు నేటితో ముగుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట అమ్ముకోవాలంటే ఆధార్‌తో కూడిన వేలిముద్ర తప్పనిసరి. అయితే, ఎండలో కష్టపడి పనిచేయడం వల్ల చాలా మంది రైతులకు వేలిముద్రలు అరిగిపోయి సిస్టమ్‌లో పడడం లేదు. సాఫ్ట్‌వేర్‌లో దీనికి ప్రత్యామ్నాయంగా ఐరిష్ లేదా ఓటీపీ వంటి ఆప్షన్లు లేకపోవడంతో అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్ర పడకపోతే కౌలు రైతుల పేరుతో అమ్ముకోవాలని జిల్లా మార్క్ ఫెడ్ అధికారి వింత సలహా చేస్తుండటం గమనార్హం.

మరోవైపు గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. టెక్నికల్ సమస్యలు, గడువు ముగిసిన పోతుండడంతో గత్యంతరం లేక రైతులు తమ పంటను తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పల్లెల్లో దళారులు ఇదే అదునుగా భావించి మద్దతు ధర కంటే తక్కువకే పంటను కాజేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు గడువును పెంచడంతోపాటు, ఐరిష్ లేదా ఓటీపీ సదుపాయం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కౌలు రైతుల పేరు మీద నమోదు చేసుకోండి

ఈ సమస్యపై జిల్లా మార్ఫ్రెడ్ అధికారిని దిశ ప్రతినిధి వివరణ కోరగా మక్కల కొనుగోలుకు ఆధార్ అనుసంధానిత వేలిముద్ర ప్రస్తుతం తప్పనిసరి అని స్పష్టం చేశారు. వేలిముద్రలు రాని పక్షంలో రైతులు తమ సాగును కౌలు రైతుల పేరు మీద నమోదు చేసుకుని పంటను అమ్ముకోవాలని సలహా ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేవని వారు పేర్కొన్నారు.-: మార్క్ ఫ్రైడ్ జిల్లా శశిధర్ రెడ్డి

అమ్ముకోవడంలోనూ ఇబ్బందులే..

పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరో యుద్ధంగా మారింది. పొలంలో కష్టపడి పని చేయడం వల్ల మా చేతి వేళ్లు అరిగిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా మెషీన్‌లో వేలిముద్రలు పడడం లేదు. అధికారులను అడిగితే మా చేతుల్లో ఏమీ లేదు. సాఫ్ట్‌వేర్ అంతే అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆధార్ సెంటర్లకు వెళ్లి అప్డేట్ చేయించుకోవాలన్నా సమయం లేదు.:- నరసయ్య, రైతు, చిట్యాల

కొనుగోలు గడువును పెంచాలి.

మా భూమిలో పండిన పంటను వేరే వాళ్ల పేరు మీద కౌలు రైతులు రాయమని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. రేపు డబ్బు వాళ్ళ ఖాతాలో పడితే వారి పరిస్థితి ఏంటి? వెంటనే కొనుగోలు గడువును పెంచాలి. వేలిముద్రలు రాని వారికి కంటి పాప ద్వారా ఫోన్ ఓటీపీ ద్వారా పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. :- సొసైటీ మాజీ చైర్మన్ కపిల్ రెడ్డి

Next Story