సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల కలకలం?

by Ajay Maddhiboyina |

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్

సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల కలకలం?
X

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి రూ.500ల దొంగనోట్లు పంచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక వివరాల ప్రకారం ఎన్నికల సమయంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు నకిలీ నోట్లు పంచినట్టు సమాచారం. ఆ నోట్లలో కొన్నింటితో ఓ రైతు కెనరా బ్యాంక్‌కి వెళ్లి క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు ప్రయత్నించాడు. బ్యాంక్ అధికారులు ఆ నోట్లు దొంగనోట్లు అని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైతును విచారించిన తరువాత ఈ వ్యవహారం బహిర్గతమైంది. అయితే, సంబంధిత కాంగ్రెస్ అభ్యర్థి అదే గ్రామంలో సర్పంచ్‌గా గెలిచినట్లు సమాచారం. ఈ ఘటన బయటకి రాకుండా కొందరు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాపకింద నీరులా నకిలీ నోట్ల దందా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం వర్ని మండలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ నోట్ల వ్యవహారం వెనక రాజకీయ పెద్దల హస్తం ఉందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందా? లేదంటే, తమ అనుచరులను ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నాల్లో భాగంగా కేసును విచారణ జరుపుతున్న పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నారా? అనే విషయాలపై అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. వర్ని మండలంలో బ్యాంకులో వెలుగులోకి వచ్చిన నకిలీ నోట్ల వ్యవహారం వెనక రాజకీయ కోణమేదైనా ఉందా? ఈ నకిలీ నోట్ల దందాకు రాజకీయ అండ ఏదైనా ఉందా? ఇలాంటి అనేక సందేహాలకు బలాన్ని చేకూర్చే వాతావరణం బాన్సువాడ డివిజన్ లో స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

వర్ని మండల కేంద్రంలో వెలుగు చూసిన నకిలీ నోట్లు..

వర్ని మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో జలాల్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి రూ. 2.085 లక్షలు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా ఆ నోట్లను క్యాషియర్ నకిలీ నోట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. వాస్తవానికి ఆ వ్యక్తి బ్యాంకులో కేవలం రూ. 45 వేలే డిపాజిట్ చేయగా, బ్యాంకు సిబ్బంది ఆ నోట్లు నకిలీవనే విషయాన్ని గుర్తించారని, పోలీసులు తమ విచారణలో భాగంగా నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా, మరో 1.63 లక్షలు దొరికినట్లుగా చెప్పుకుంటున్నారు. రాజకీయ జోక్యంతో ఈ కేసు విచారణను తొక్కి పెట్టేందుకు, నకిలీ నోట్ల వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బాన్సువాడ డివిజన్ లో చర్చించుకుంటున్నారు. బాన్సువాడలో ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడైన ఓ కొత్తగా ఎంపికైన సర్పంచ్ కు దొంగ నోట్ల కేసులో నిందితుడు దగ్గరి బంధువు కావడంతో పాటు, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ ఈయన చేతుల మీదుగానే జరగడంతో కేసును తిరిగి తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయంతో ఈ నకిలీ నోట్ల కేసును మరుగున పడేసేందుకు పోలీసులపై ప్రజాప్రతినిధి ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. నిందితుడు బ్యాంకులో డిపాజిట్ చేసిన నకిలీ నోట్లు కేవలం రూ.45వేలే కాగా, పోలీసులకు నిందితుడి ఇంట్లో దొరికిన రూ. 1.63 లక్షల నకిలీ నోట్లను కూడా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్లినట్లు చెప్పడం వెనక రాజకీయ జోక్యం ఉన్నట్లు బాన్సువాడ డివిజన్ అంతా కోడై కూస్తోంది.

కేసును లోతుగా విచారిస్తే..

వర్ని బ్యాంకులో వెలుగు చూసిన నకిలీ నోట్ల వ్యవహారం పై పోలీసులు లోతుగా విచారణ జరిపిస్తే ఇటీవల జరిగిన స్థానిక ఎన్‌నికల్లో ఓటర్లకు పంపిణీ చేసిన నోట్లలో నకిలీ నోట్లున్న విషయాలతో పాటు, ఈ నోట్లు ఎక్కడి నుండి సప్లయ్ అవుతున్నాయి.. ఈ నకిలీ నోట్ల దందా వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? వీరికి అండగా ఉన్నదెవరనే విషయాలు బయటికొస్తాయనే భయంతోనే ఈ కేసును తొక్కి పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లాలో చర్చించుకుంటున్నారు.

దృష్టి సారించనున్న బీఆర్ఎస్ నేతలు..

వర్నిలో నకిలీ నోట్ల వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితుడిని తప్పించడంతో పాటు, కేసును మరుగున పడేసేందుకు కాంగ్రెస్ నేత, ప్రజాప్రతినిధి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు, నకిలీ నోట్ల దందా గుట్టు రట్టు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.

Next Story