పైసలిస్తేనే కలిసేది! అధికార పార్టీ ముఖ్య నేత గన్‌మెన్ల వసూళ్ల పర్వం

by Ajay Maddhiboyina |

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేత గన్‌మెన్లు విచ్చలవిడి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నియోజకవర్గ సమస్యలు, ఫిర్యాదులు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య ప్రజలు, కార్యకర్తల వద్ద కూడా ‘ఎంట్రీ ఫీజు’ వసూలు చేస్తుండడంతో క్యాడర్ ఆందోళన చెందుతోంది.

పైసలిస్తేనే కలిసేది! అధికార పార్టీ ముఖ్య నేత గన్‌మెన్ల వసూళ్ల పర్వం
X

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేత గన్‌మెన్లు విచ్చలవిడి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నియోజకవర్గ సమస్యలు, ఫిర్యాదులు చెప్పుకోవడానికి వచ్చే సామాన్య ప్రజలు, కార్యకర్తల వద్ద కూడా ‘ఎంట్రీ ఫీజు’ వసూలు చేస్తుండడంతో క్యాడర్ ఆందోళన చెందుతోంది. గన్‌మెన్లకు డబ్బులు ఇస్తేనే నాయకుడిని కలవనిస్తూ, లేదంటే ఎంతటి వారినైనా గేటు బయటే ఆపేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అసలు ఈ వసూళ్ల పర్వం సదరు ముఖ్యనేతకు తెలియకుండానే జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గన్‌మెన్ల అరాచకాలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దారితీయడంతో ఈ అంశం ప్రతిపక్షాల చేతికి ప్రధాన అస్త్రంగా మారే ప్రమాదం ఉంది. పార్టీ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినక ముందే సదరు నేత వెంటనే జోక్యం చేసుకుని, ఆ వసూళ్ల సంస్కృతికి చెక్ పెట్టి గన్‌మెన్లను మార్చాలని శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

- దిశ, కామారెడ్డి

దిశ, కామారెడ్డి : అధికార పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత పరువును ఆయన గన్‌మెన్లు బజారున పడేస్తున్నారు. నాయకుడి మెప్పు పొంది బాధ్యతగా పనిచేయడం మాని నేతను కలవడానికి వచ్చే వారి వద్ద వసూళ్లకు పాల్పడుతుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము అధికార పార్టీలో ఉన్నామనే ధీమాతో సదరు గన్‌మెన్లు విర్రవీగుతున్నారని, డబ్బులు ఇస్తేనే నాయకుడి దగ్గరకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ, లేదంటే గేటు బయటే ఆపేస్తున్నారని కార్యకర్తలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా ‘ఎంట్రీ ఫీజు’ కట్టాల్సిందే...

సదరు ముఖ్య నేత వద్ద ఏ చిన్న పని కావాలన్నా, నియోజకవర్గ సమస్యలపై ఫిర్యాదు ఇవ్వాలన్నా ముందుగా గన్‌మెన్లకు ‘ఎంట్రీ ఫీజు’ చెల్లించాల్సిందేనని పలువురు నాయకులు వాపోతున్నారు. డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కోసం కష్టపడిన క్యాడర్‌ను కనీసం లోపలికి కూడా రానివ్వడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ దందా రోజురోజుకూ పెరిగిపోతుండడంతో సామాన్య కార్యకర్తలు తమ నాయకుడిని కలిసేందుకే జంకుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం సదరు ముఖ్య నేతకు తెలియకుండానే జరుగుతోందా? లేక ఆయన ప్రమేయంతోనే నడుస్తోందా? అనే అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

పార్టీ ఇమేజ్‌కు భారీ డ్యామేజ్...

గన్‌మెన్లు ఎవరిని లోపలికి పంపాలి, ఎవరిని ఆపాలో వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పైస్థాయి నాయకత్వం స్పందించకపోవడంపై క్యాడర్ గుసగుసలాడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ‘ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు’ అన్న పేరు పోయి, ‘పైసలిస్తేనే కలిసే నాయకుడు’ అన్న ముద్ర పడుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వసూళ్ల రాజకీయం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత మొదలైంది. గన్‌మెన్ల అరాచకాలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దారితీస్తుండడంతో సీనియర్ నాయకులు తలపట్టుకుంటున్నారు.

ప్రతిపక్షాలకు అస్త్రం.. నేత జోక్యం అత్యవసరం..

ఈ వసూళ్ల వ్యవహారాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయని, రాబోయే రోజుల్లో దీనిని ‘అవినీతి, వసూళ్ల రాజకీయం’ పేరుతో ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. పార్టీ ప్రతిష్ట దెబ్బతినక ముందే సదరు ముఖ్య నేత వెంటనే జోక్యం చేసుకుని ఈ వసూళ్ల సంస్కృతికి చెక్ పెట్టాలని, అక్రమాలకు పాల్పడుతున్న గన్‌మెన్లను తక్షణమే మార్చాలని పార్టీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సదరు నేతతోపాటు పార్టీకి కూడా భారీ నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Next Story