ఈ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. ఎందుకంటే.. ?

by Naveena |

సకల సౌకర్యాలున్నా, ఆర్భాటమైన జీవితాన్ని సాగిస్తున్నా ఇంకా ఏదో కావాలని, తన లైఫ్ లో ఏదో తగ్గిందని బాధ పడేవారే అడుగడుగుకూ మనకు కనిపిస్తారు.

ఈ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. ఎందుకంటే.. ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సకల సౌకర్యాలున్నా, ఆర్భాటమైన జీవితాన్ని సాగిస్తున్నా ఇంకా ఏదో కావాలని, తన లైఫ్ లో ఏదో తగ్గిందని బాధ పడేవారే అడుగడుగుకూ మనకు కనిపిస్తారు. కానీ, ఉన్నంతలో సంతోషాన్ని వెతుక్కుని, చిన్న పనినైనా గౌరవంగా భావించి ఇష్టంతో పని చేసే వారు, కుటుంబంతో సంతోషంగా జీవించే వారు ఈ సమాజంలో అతి కొద్ది మందే ఉంటారు. ఆ అతికొద్ది మందిలో నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్ కు చెందిన 65 ఏళ్ల వయసున్న ఎరుపుల లక్ష్మణ్ ఉన్నారు.

తలపై ఓ బుట్ట ఆ బుట్టలో పెనంపై వేయించిన పల్లీలు, బఠానీలు పేపర్ ఫోల్డర్స్ వేసుకుని నగరంలో వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రూ.5 లకు, రూ. 10 లకు బుట్ట దింపుతూ, ఎత్తుకుంటూ కష్టపడుతున్నాడు. ప్రతిరోజు మధ్యాహ్నం రెండుగంటల నుండి రాత్రి 8 గంటల దాకా నగరంలో అక్కడక్కడా తిరుగుతూ పల్లీలు,బఠానీలు అమ్ముకుంటూ రోజూ వారీ సంపాదనతో తన భార్యతో కలిసి హాయిగా జీవిస్తున్నానని ఆయనన్నారు. ఏడాదిలో 8 నెలలు (చలి కాలం, వర్షాకాలం) మాత్రమే అత్యధికంగా తన వ్యాపారం సాగుతుందని, ఆ రోజుల్లో దినమంతా పని చేస్తానన్నారు. ఎండాకాలం ప్రతిరోజు రూ.200 లు కూడా అమ్ముడు పోవని ఆయనన్నారు. తనకు ఒక కొడుకు,కూతురు కాగా,ఇద్దరికి పెళ్లిళ్లు చేశానన్నారు. తన కొడుకు తన భార్యా, పిల్లలతో కలిసి విడిగా ఉంటున్నాడని లక్ష్మణ్ తెలిపారు. తను తన భార్య కలిసి ఉంటున్నామని, ఉన్నంతలో తాము సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపారు.

చిన్న నాటి నుంచి స్వశక్తితో బతకడం, పని ఎంత చిన్నదైనా దాన్ని గౌరవంగా భావించి చేయడాన్ని తాను తన తండ్రి నుండి అలవర్చుకున్నానని లక్ష్మణ్ తెలిపారు. ఏడాదిలో 8 నెలలు తన సంపాదన సంతృప్తికరంగా ఉంటుందన్నారు. ఈ రోజుల్లో చదువుకున్న యువత తమ చదువుకు తగ్గ పనిదొరకడం లేదని, ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ తల్లిదండ్రులకు భారమవుతున్నారని, పని చేయడం కూడా చేతకాని వారిలా మారిపోతున్నారని లక్ష్మణ్ అన్నారు. ఇది నేటి యువతకు తగదని జీవితాన్ని బాగా అవపోసన పట్టిన వ్యక్తిగా చెప్పిన లక్ష్మణ్ మాటలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అక్కడున్న వారు ప్రశంసించారు. తను నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ పవార్ దగ్గర కూడా పని చేశానని, చాలా మంది వద్ద పని చేసినా ఎవరి నుండి ఏదీ ఆశించలేదన్నారు. తన కష్టాన్ని నమ్ముకునే బతుకుతున్నానని, ప్రభుత్వం ద్వారా ప్రతినెలా తనకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయన్నారు. కొడుకు, కోడలు విడిగా ఎందుకుంటున్నారని అడగ్గా ఎవరి జీవితాలు వారివని, వారి అభిప్రాయాలను గౌరవించడం తప్ప తాము చేసేదేముంటుందని లక్ష్మణ్ చెపుతున్నప్పుడు ఆయన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయే తప్ప మరేం మాట్లాడలేదు.

Next Story