డీడీలు లేకుండానే యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం..

by Bhanu |

ట్రాన్స్ఫార్మర్లపై కొంతమంది డీడీలు చెల్లించకుండా అక్రమంగా కనెక్షన్లు తీసుకుని బోరు మోటార్లు నడిపించు కుంటుండడంతో వాటిపై లోడ్ పడి కాలిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డీడీలు లేకుండానే యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం..
X

దిశ, కామారెడ్డి : ట్రాన్స్ఫార్మర్లపై కొంతమంది డీడీలు చెల్లించకుండా అక్రమంగా కనెక్షన్లు తీసుకుని బోరు మోటార్లు నడిపించు కుంటుండడంతో వాటిపై లోడ్ పడి కాలిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా డీడీలు చెల్లించకుండా అక్రమ కనెక్షన్లతో మోటార్లు దొంగ చాటుగా నడిపించుకుంటుండడంతో ట్రాన్స్కోకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది. దీంతో ఇటు రైతులతో పాటు అటు ట్రాన్స్కో కూడా నష్టపోతుంది. ట్రాన్స్కో లో వేతనాలు తీసుకుంటూ రైతులకు సేవ చేయాల్సిన స్థానిక అధికారులు సిబ్బంది దొంగ కనెక్షన్ల వాడకం దారుల వద్ద ముడుపులు తీసుకుని డీడీలు చెల్లించకుండా కనెక్షన్లను ప్రోత్సహిస్తుండడంతోనే ట్రాన్స్ఫార్మర్లపై అధిక భారం ఎక్కువయి కాలిపోయి ఇటు రైతులు ఇబ్బందులు పడుతుండగా అటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది.

స్థానిక అధికారులు, సిబ్బంది చేతివాటం...

డీడీలు చెల్లించకుండా అక్రమంగా కనెక్షన్లు తీసుకుని విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారి వద్ద స్థానికంగా ఉండే కొంతమంది అధికారులు సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో ఆక్రమణదారులు డీడీలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. దీంతో డీడీలు ఉన్న దాని ప్రకారం ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ ఉండగా అక్రమంగా బోరు మోటర్లు నడిపించుకుంటున్న వారి వల్ల ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడి కాలిపోతుండడం, ఫీజు వైర్లు ఎగిరిపోతుండడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉన్నతాధికారుల తనిఖీలు శూన్యం...

వ్యవసాయ బోరు బావుల వద్ద డీడీలు చెల్లించకుండా అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారి పై తనిఖీలు చేయకుండా ఉన్నతాధికారులు కాలయాపన చేయడంతో స్థానిక అధికారులు, సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తే విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారు సక్రమంగా డీడీలు చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయని, స్థానిక సిబ్బంది పనితీరులో నాణ్యత కనిపిస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

డీడీలు చెల్లిస్తే అదనపు ట్రాన్స్ఫార్మర్లు కేటాయిస్తాం : శ్రావణ్ కుమార్, ట్రాన్స్కో ఎస్ ఈ కామారెడ్డి

ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఎవరైనా డీడీలు చెల్లించకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటాం. విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారికి ట్రాన్స్కో అధికారులు గానీ సిబ్బంది గానీ సహకరిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. విద్యుత్ కనెక్షన్ కోసం 6000 రూపాయల డిడి చెల్లిస్తే ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచి కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగిస్తాం. లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు ఉంటే మరో కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు తమకు సహకరించి డీడీలు చెల్లించి నాణ్యమైన విద్యుత్తును పొందాలి.

Next Story