కుస్తీ పోటీల్లో అపశృతి

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామంలో జరుగుతున్న కుస్తీ పోటీల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కుస్తీ పోటీల్లో అపశృతి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామంలో జరుగుతున్న కుస్తీ పోటీల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కుస్తీ వీరుడిపై కానిస్టేబుల్ లాఠీతో విరుచుకు పడి విచక్షణ రహితంగా కొట్టడంతో తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. దీంతో స్థానికులు కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మల్లూర్ కుస్తీ పోటీల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూర్ లో బారడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. అయితే కుస్తీ పోటీల్లో నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన పోతారాజు మైసయ్య పాల్గొనేందుకు పలు మార్లు ప్రయత్నిస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో అతని పై నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ బాల్ రాజ్ తన లాఠీతో విచక్షణ రహితంగా సదరు వ్యక్తిని బాదడంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. బాధితుడి తలకు అయిన గాయాన్ని చూసిన స్థానికులు కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. దీంతో ఎస్సై శివకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రి కి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి పై కేసు నమోదు


మల్లూరు గ్రామంలో కుస్తీ పోటీల దగ్గర మద్యం మత్తులో వడ్డేపల్లి గ్రామానికి చెందిన పోతరాజు మైసయ్య అనే వ్యక్తి న్యూసెన్స్ చేస్తూ.. కుస్తీ పోటీలు జరగనివ్వకుండా ఇబ్బందులకు గురి చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. మద్యం మత్తులో పోతరాజు మైసయ్య అనే వ్యక్తి న్యూసెన్స్ చేస్తూ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగిస్తూ రింగుతాడు కు తగిలి నుదురు భాగం లో దెబ్బ తగిలిందన్నారు. దీంతో వడ్డేపల్లి గ్రామస్తుల సహకారంతో అతన్ని ఎల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించి చికిత్స అనంతరం అతనికి బ్రీత్ అనలైజ్ చేయగా 73 BAC వచ్చిందన్నారు. దీంతో అతని పైన, అతనికి సహకరిస్తూ పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన వారి పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

Next Story