ఇంటర్ విద్యార్థి అదృశ్యం

by Ratna Kumari |

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ఓ విద్యార్థి ఇంటి నుండి బయలుదేరి అదృశ్యమయ్యారు.

ఇంటర్ విద్యార్థి అదృశ్యం
X

దిశ ప్రతినిధి నిజామాబాద్ : ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ఓ విద్యార్థి ఇంటి నుండి బయలుదేరి అదృశ్యమయ్యారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఆదివారం ఉదయం వెలువడ్డాయి. నందిపేట్ కు చెందిన అరవింద్ అనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మ్యాథ్స్ సబ్జెక్టులో ఒక మార్కుతో ఫెయిల్ అయినందుకు మనస్థాపం చెంది ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అన్నిచోట్ల వెతికిన ఆచూకీ దొరకకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చే చేసినట్లు విద్యార్థి అరవింద్ తల్లి కృష్ణవేణి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆల్ ఫోర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి తండ్రి కరోనా సమయంలో చనిపోయినట్లు కృష్ణవేణి తెలిపారు. తండ్రి చనిపోయినప్పటి నుండి తన ఇద్దరి కొడుకులను తన కష్టంతోనే సాదుతున్నానని, ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయినట్లు అరవింద్ తల్లి కృష్ణవేణి తెలిపారు. పరీక్ష ఫెయిల్ అయినందుకు తన కొడుకును తానేమీ మందలించనని, ఎవరు ఏమి అనరని, వెంటనే ఇంటికి తిరిగి రావాలని తన కొడుకును తల్లి కృష్ణవేణి అభ్యర్థిస్తోంది. భర్త చనిపోయిన నుంచి తాను తన ఇద్దరి కొడుకుల కోసమే బతుకుతున్నానని, నా పెద్ద కొడుకు ఇలా చెప్పా పెట్టకుండా అదృశ్యమై తనకు తీరని వేధన కలిగించాడని కృష్ణవేణి రోధిస్తూ తెలిపింది. పోలీసులు విద్యార్థి ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Next Story