- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీడీ కార్మికుల పింఛన్లు, విద్యార్థినుల శానిటరీ ఫ్యాడ్లలో కోట్లాది రూపాయలు స్వాహా..!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017-18 సంవత్సరంలో బీడీ కార్మికుల పింఛన్ల కోసం రూ. 430 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 45.28 కోట్లు దోచుకున్నారని.. 2019-20 లో రూ. 803 కోట్లు కేటాయిస్తే అందులో నుంచి రూ. 84.30 కోట్లు దోపిడీకి పాల్పడ్డారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

దిశ, కామారెడ్డి : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017-18 సంవత్సరంలో బీడీ కార్మికుల పింఛన్ల కోసం రూ. 430 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 45.28 కోట్లు దోచుకున్నారని.. 2019-20 లో రూ. 803 కోట్లు కేటాయిస్తే అందులో నుంచి రూ. 84.30 కోట్లు దోపిడీకి పాల్పడ్డారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్ కిట్ల కోసం రూ.44 కోట్లు కేటాయిస్తే.. రూ.40.20 కోట్లు దోచుకున్నారని, 2018-19 లో రూ.75 కోట్లు కేటాయిస్తే రూ.41.51 కోట్లు తిన్నారని ఆరోపించారు. పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేక బాత్ రూమ్ లు నిర్మించడం కోసం కేటాయించిన నిధుల్లో కూడా రూ.71 కోట్లు తిన్నారన్నారు.
వికలాంగులకు చెందిన నిధుల్లో రూ.1.25 కోట్లు మెక్కారని ఆరోపించారు. కళ్యాణలక్ష్మీ పథకంలో రూ.2 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మైనారిటీలకు కేటాయించిన నిధులలో సైతం దోపిడీ జరిగిందన్నారు. 2014-15 సంవత్సరంలో మైనార్టీలకు రూ.1050 కోట్లు కేటాయించి అందులో రూ.726.15 కోట్లు దోచుకున్నారని, 2015-16 లో రూ.556 కోట్లు, 2017-18లో రూ.370 కోట్లు మొత్తం రూ.2 వేల కోట్లు దోచుకున్నారని వివరించారు. ఈ లెక్కలన్నిటితో కామారెడ్డిలోని ఏ చౌరస్తాలో అయినా చర్చకు సిద్ధమని, ఇవి తప్పని నిరూపిస్తే కామారెడ్డి చౌరస్తాలో ఉరేసుకుంటానని, ఆ పార్టీల నాయకులు ఉరేసుకుంటారా..? అని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపట్టిన కులగణలో 2 వేల గాడిదలు, 1.38 లక్షల పందులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లెక్కలు చెప్పారని, కులగణనలో జనాభా లెక్కలు చెప్పాలని అడిగితే తాము చెప్పమని అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం వద్ద పందులు, గాడిదల లెక్కలే ఉన్నాయి కానీ మనుషుల లెక్కలే లేవని విమర్శించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసారని, బీసీ లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. బీసీలకు ఏటా రూ20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి రూ.9 వేల కోట్లు దొంగతనం చేసారన్నారు.
రేవంత్ రెడ్డే అసలైన దొంగ అని, ఆయనను మించిన దొంగ ఎవరు లేరన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు రూ.12500 లకు మార్కెట్లో మంచం లభిస్తే ప్రభుత్వం మాత్రం రూ.33 వేలు పెట్టి కొన్నారని తెలిపారు. పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకం కింద 2014-15లో రూ.1054 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రూ.697.40 కోట్లు తిన్నారని, 2015-16లో రూ.529 కోట్లు, 2017-18 లో రూ.1470 కోట్లు, 2018-19లో రూ.1790 కోట్లు తిన్నారని ఆరోపించారు. ఈ సొమ్మంతా మూకుమ్మడిగా పంచుకున్నారని, పేదలకు మాత్రం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఈ లెక్కలపై నిలదీయాలని కోరారు. తన పిల్లల మీద ఒట్టు వేసి చెప్తున్నానని, పేదల పిల్లల భవిష్యత్తు మార్చేందుకు తాను వచ్చానని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎన్ని ఇచ్చినా తీసుకోవాలని, కానీ కత్తెర గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర నాయకులు హరిశంకర్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి ఆకుల హన్మాండ్లు, జిల్లా అధ్యక్షుడు తాహెర్ మహ్మద్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోషి, కౌన్సిలర్ అభ్యర్థులు బొక్కల వేణు పాల్గొన్నారు.






