నడిరోడ్డు పైనే ఘాతుకాలు.. కలవరపెడుతున్న దారుణ హత్యలు

by Ajay Maddhiboyina |

జన సంచారం ఉండదు, ప్రశ్నించే వారుండరు. కనుచూపు మేరల్లో ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లు, చెట్లు నిఘా అంతంతే. ఇదే అవకాశంగా తీసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రహదారి శివార్లలో నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న హత్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

నడిరోడ్డు పైనే ఘాతుకాలు.. కలవరపెడుతున్న దారుణ హత్యలు
X

దిశ, నవీపేట్: జన సంచారం ఉండదు, ప్రశ్నించే వారుండరు. కనుచూపు మేరల్లో ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లు, చెట్లు నిఘా అంతంతే. ఇదే అవకాశంగా తీసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రహదారి శివార్లలో నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న హత్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఎవరు, ఎందుకు హత్య చేశారో కనుక్కోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారుతోంది. హత్యలు, హత్యా ప్రయత్నాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రోజురోజుకూ దారుణ ఘటనలు వణికిస్తున్నాయి. దుండగులు పగబట్టి సాటి మనుషులను నడి రోడ్డుపైనే నరికి చంపుతున్నారు. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశానికి లోనై కొందరు, భూ తగాదాలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక లావాదేవీలతో మరికొందరు ప్రత్యర్థులపై దాడికి తెగబడుతున్న ఘటనలు ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంటున్నాయి. పాత నేరస్తులపై నిఘా పెట్టడం, భూ తగాదాలు, కుటుంబ గొడవలు, ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యర్థులతో ముప్పుందని తెలిసినప్పటికీ వారిని గట్టిగా హెచ్చరించకపోవడంతో హత్యలు, దాడులకు దారి తీస్తున్నట్లు జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వీటిని నియంత్రించాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

గత రెండు మాసాల నుంచి మండలంలో జరుగుతున్న వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహాలను తీసుకువచ్చి సంచిలో మూటగట్టి పడేయడం, తగలబెట్టడం, తల మొండెం వేరు చేయడం లాంటి ఆకృత్యాలకు హంతకులు పాల్పడుతున్నారు. రెండు మాసాల వ్యవధిలో రహదారికి కొద్ది దూరంలోనే గుర్తుతెలియని మృతదేహాలు లభ్యం కావడం మండలంలో సర్వత్ర చర్చనీయాంశమైంది. సవాలుగా తీసుకున్న పోలీసులు పలు కోణాలలో దర్యాప్తును చేస్తూ హంతకుల వేటను ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాసర రహదారి పక్కన ఫతేనగర్ శివారులో గత నెల 23న అర్థరాత్రి హత్యకు గురైన శ్యామల లక్ష్మి హత్య కేసులో పురోగతి సాధించిన పోలీసులు హంతకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గుట్టలు, చెట్ల పొదలతో నిర్మానుషమై మహారాష్ట్ర, నిర్మల్ జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఏర్పడింది. హంతకులు హత్యలు చేసి తప్పించుకోవడానికి అనువైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని పలు జిల్లాల నుండి రహదారి వ్యవస్థ మెరుగుపడడం రాత్రి సమయాలలో ఎలాంటి నిఘా లేకపోవడం, సరిహద్దుల్లో సీసీ కెమెరాలు, భద్రత చర్యలు చేపట్టకపోవడంతో దుండగులు సరిహద్దు దాటి వచ్చి బాసర రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశాలలో మృతదేహాలను పడి వేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు బాసర రహదారి పక్కన గుట్టలు చెట్లు తో పాటు గ్రామాలు మధ్య దూరం ఎక్కువగా ఉండడం మరియు బాసర ప్రధాన రహదారికి ఇరువైపుల గల గ్రామాలలో రాత్రిపూట జనసంచారం తక్కువగా ఉండడం ఒక కారణమని భావిస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతాలలో మిస్సింగ్ అయ్యే వ్యక్తుల వివరాలు మన రాష్ట్ర పోలీసులకు తెలియదు కాబట్టి మహారాష్ట్రకు సరిహద్దు గా ఉన్న మండలాన్ని నిందితులు ఎన్నుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఈ దిశగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

మండలంలో సెప్టెంబర్ 19 నాడు బాసర రహదారికి కొద్దిగా దూరంలో నాగేపూర్ శివారులో ఒక గుర్తు తెలియని యువకుని మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి వెళ్లి పంచనామ నిర్వహించిన పోలీసులు ఇప్పటివరకు మృతదేహం యొక్క గుర్తింపు గానీ నిందితులను గాని పట్టుకోలేకపోయారు. ఈ ఘటన మరవకముందే గత నెల 23 అర్ధరాత్రి జరిగిన మద్దేపల్లి కి చెందిన శ్యామల లక్ష్మి హత్య సంచలం సృష్టించింది. నవీపేట్ మండల కేంద్రం నుండి బాసరకు వెళ్లి ప్రధాన రహదారి కి కొద్ది దూరంలో మద్దేపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి ని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోలు పోసి నిప్పట్టించారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు ఈ నెల 1న ఫకీరాబాద్, మిట్టాపూర్ గ్రామాల మధ్య గుర్తుతెలియని మహిళను వివస్త్ర ను చేసి మొండెం నుండి తల, చేయి వేరు చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. హంతకులు వేరే ప్రాంతంలో హత్య చేసి బాసర రోడ్డు పక్కన పడవేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులను సవాలుగా తీసుకున్న నిజామాబాద్ సీపీ సాయి చైతన్య హంతకులను వేటాడేందుకు వెనువెంటనే 10బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై తిరుపతి లు హంతకులను పట్టుకునేందుకు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా సంచలనం సృష్టించిన మహిళల హత్య కేసుల నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story