నేర నియంత్రణ – ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం

by Taduka Kalyani |

జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరుపై నెలవారీ నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు.

నేర నియంత్రణ – ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం
X

దిశ,కామారెడ్డి రూరల్ : జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరుపై నెలవారీ నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నమోదవుతున్న ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో చట్టపరమైన గడువులోగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేసి, సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయడం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. సీసీటిఎన్ఎస్ 2.0 అమలులో భాగంగా నమోదైన ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో బస్సులు, అనుమానాస్పద వాహనాలు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పగలు, రాత్రి బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదలు, భారీ వర్షాలు, ఇతర అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉన్న మ్యాన్‌పవర్‌కు అనుగుణంగా డ్యూటీ రోస్టర్‌ను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. సిబ్బందిపై అధిక పని భారం పడకుండా విధులను సమతుల్యంగా కేటాయిస్తూ, ప్రతి ఒక్కరికీ బాధ్యతలను స్పష్టంగా నిర్ధారించాలని తెలిపారు. డ్యూటీ రోస్టర్‌ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన పోలీసు సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె నరసింహ రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక విభాగాల అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story