- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది.

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు
పాత కాంగ్రెస్ నాయకులకే 80 శాతం టిక్కెట్లు?
డీసీసీ లకు పీసీసీ నుంచి అందిన ఆదేశాలు?
కార్పొరేషన్ సహా మున్సిపాలిటిపై పాగాకు వ్యూహాలు
టికెట్లు దక్కేదెవరికో అంటూ అంచనాలు
దిశ ఆర్మూర్ : స్థానిక సంస్థలకు గతనెలలో జరిగిన ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులే మెజారిటీ స్థానాలు దక్కించుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అదే ఊపులో ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్ సహా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, రాష్ట్ర పీసీసీ పెద్దలు ఇదే ఊపుతో ఉమ్మడి జిల్లాలో సత్తా చాటుకుని కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేలా పక్కాగా ప్రణాళికలు రూపొందించేందుకు జిల్లా పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు మెల్లిమెల్లిగా రంగం సిద్ధం చేస్తున్నట్లు కనబడుతోంది. మున్సిపోల్స్ లో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యాచరణను ప్రారంభించారు.
కార్పొరేషన్, మున్సిపాలిటీలోని ప్రతి వార్డుల్లో రిజర్వేషన్ల ఆధారంగా ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేసి లిస్టును పీసీసీకి పంపాలని జిల్లాలోని డిసిసిలకు పీసీసీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల లోని అన్ని స్థానాలకు బడుగు బలహీన సామాజిక వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ తరుపున పోటీ చేసే ఆశావాహుల పేర్లను సిద్ధం చేయాలని పిసిసి అధినాయకత్వం డిసిసిలకు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో సైతం పార్టీ కోసం కష్టపడి వెన్నంటి నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత కింద టికెట్లు కేటాయించాలని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు కార్యకర్తలకు రెండో ప్రాధాన్యత కింద టికెట్లు కేటాయించాలనే ఆలోచనలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన ఇతర పార్టీలకు చెందిన నాయకులకు మూడో ప్రాధాన్యత కింద 20శాతానికి మించకుండా టికెట్లు కేటాయించాలని డీసీసీలకు పీసీసీ నాయకులను నుంచి ఆదేశాలు జారీ అయినట్లు చెపుతున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నేతలెందరో..
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక పార్టీలో చేరిన వారికి మున్‌సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందోనన్న అనుమానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు సైతం పార్టీని వీడకుండా పార్టీ కోసం పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత కింద టికెట్లు ఇవ్వాలని పీసీసీ నుంచి డీసీసీలకు ఆదేశాలు అందినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల, కార్యకర్తలకు మూడవ ప్రాధాన్యత కింద 20 శాతం మేర మాత్రమే టికెట్లు కేటాయించాలని డీసీసీ లకు ఆదేశాలిందినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసిన బడుగు బలహీన సామాజిక వర్గాలకు చెందిన ఆశావహుల పేర్లను పరిశీలించి ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లో టికెట్లు ఎందరికి కేటాయిస్తారోననే చర్చ మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ చర్చతో ప్రభుత్వ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల్లో, కార్యకర్తల్లో అలజడి మొదలైంది.






