- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోటీ చేద్దామా వద్దా.. ఆశావహులకు రోజుకో ట్విస్ట్!
స్థానిక సంస్థల ఎన్నికలు ఆశావహులకు రోజుకో సినిమాను చూపిస్తున్నాయి. రిజర్వేషన్ల అంశంపై ఎటూ తేల్చకపోవడంతో ఏం చేయాలో తెలియక పోటీ చేయాలనుకుంటున్న వారు తర్జన భర్జన పడుతున్నారు. అటో ఇటో ఎటో తేల్చుకోలేని పరిస్థితుల్లో పడిపోయారు.

దిశ, కామారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికలు ఆశావహులకు రోజుకో సినిమాను చూపిస్తున్నాయి. రిజర్వేషన్ల అంశంపై ఎటూ తేల్చకపోవడంతో ఏం చేయాలో తెలియక పోటీ చేయాలనుకుంటున్న వారు తర్జన భర్జన పడుతున్నారు. అటో ఇటో ఎటో తేల్చుకోలేని పరిస్థితుల్లో పడిపోయారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఈసారి ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినా, ప్రభుత్వం రిజర్వేషన్లపై జీవో విడుదల చేసిన ఫలితం కనిపించడం లేదు. రిజర్వేషన్లపై పలువురు కోర్టు మెట్లెక్కిన రెండేళ్లుగా ఎన్నికలపై నెలకొన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో పోటీ చేయడానికి సిద్ధమైన అభ్యర్థులకు ఒక రకమైన టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ కోసం అప్పు చేసి డబ్బులు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అప్పులకు వడ్డీ పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికలు వాయిదా పడితే పరిస్థితి ఏంటి అన్న చర్చ సాగుతోంది.
విచారణ వాయిదా.. అభ్యర్థుల్లో టెన్షన్
ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ జీఓపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయని హైకోర్టు మెట్లెక్కారు. పిటిషన్లపై హైకోర్టులో బుదవారం వాడివేడిగా వాదనలు జరిగాయి చివరికి విచారణను నేటికి వాయిదా వేసింది హైకోర్టు. దాంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది. నేటి విచారణలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ కోర్టు కొట్టివేస్తే రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
గతానికి ప్రస్తుతానికి రిజర్వేషన్లు తారుమారు
అయితే ఇటీవల స్థానిక సంస్థలకు ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లు ప్రకటించింది. గతంలో ఉన్న రిజర్వేషన్లు ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లలో అనేక చోట్ల తారుమారయ్యాయి. తమకు అనుకున్న విధంగా రిజర్వేషన్ వస్తుందన్న అనేక మందికి ఇటీవల వచ్చిన రిజర్వేషన్లు షాకిచ్చాయి. ఈ క్రమంలో నేటి హైకోర్టు తీర్పుపై మరోసారి రిజర్వేషన్లపై ఆందోళన నెలకొంది.
అప్పు చేసి డబ్బుల సర్దుబాటు
ఇటీవల విడుదలైన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నారు. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పోటీ పక్కా అనుకున్న అభ్యర్థులు ఇప్పటికే తమకు కావాల్సిన డబ్బులను సర్దుబాటు చేసుకున్నారు. మరికొంత మంది అప్పు చేసి డబ్బులు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో అప్పు చేసిన అభ్యర్ధులలో టెన్షన్ నెలకొంది. మరోసారి రిజర్వేషన్లు తారుమార్తెతే అప్పు చేసిన అభ్యర్థులు వడ్డీ భరించుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి.
నామినేషన్లు దాఖలయ్యేనా..?
ఇదిలా ఉండగా రిజర్వేషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో నేడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. నేటి నుంచి అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నోటిఫికేషన్ కు అడ్డంకులు తొలగినా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముందుకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైకోర్టు తీర్పు తర్వాతే నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి హైకోర్టు తీర్పుపై పోటీ చేసే అభ్యర్థులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.






