- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్లౌడ్ బరస్ట్...కామారెడ్డికి నిలిచిపోయిన రాకపోకలు
కామారెడ్డి జిల్లాను క్లౌడ్ బరస్ట్ చుట్టుముట్టింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షాలకు జిల్లా మొత్తం అతలాకు

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాను క్లౌడ్ బరస్ట్ చుట్టుముట్టింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. చెరువులు నిండి నీరంతా రోడ్లపై నుంచి పారుతుండగా ఎక్కడికక్కడే వాహనాల నుంచి పోయి రాకపోకలు స్తంభించాయి. భిక్కనూర్ తలమడ్ల రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్ కొట్టుకపోవడంతో రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల నుంచి వచ్చే దారులన్నీ నీటితో పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పట్టణంలో మీ హౌసింగ్ బోర్డ్ వద్ద నీటిలో మూడు కార్లు కొట్టుకుపోయాయి. నిజాంసాగర్ మండలం అన్నసాగర్, బొగ్గు గుడిసె వద్ద జరుగుతున్న రోడ్డు పనుల్లో పాల్గొన్న 9 మంది బీహార్ కూలీలు ట్యాంకర్ పై నిల్చుని బిక్కు బిక్కు మంటూ గడిపారు.
వీరిని కాపాడేందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తో పాటు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెలికాప్టర్ తెప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ డి ఆర్ ఎఫ్ రెస్క్యూ, ఫైర్ బృందాల సహాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రాజంపేట మండలం కొండాపూర్, ఆర్గొండ, ఎల్లాపూర్ తండా, ఎల్లారెడ్డిపల్లి, గుడి తండాతో పాటు చుట్టుపక్కల తండాలన్నీ నీటితో నిండిపోయాయి. ఇక్కడి వాసులను తరలించేందుకు హెలికాప్టర్ కావాలని తండావాసులు వేడుకుంటున్నారు. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీటిలో చిక్కుకున్న పలువురిని కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి నీటిలో నుంచి బయటకు సురక్షితంగా తీసుకువచ్చారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై జంగంపల్లి శివారులో నీరు రోడ్డుపై నుంచి పారడంతో నిజామాబాద్- హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
జలదిగ్బంధంలో కామారెడ్డి
భారీ వర్షంతో కామారెడ్డి అతలాకుతలం అవుతోంది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీల నీరు ప్రధాన రహదారులపైకి చేరుతున్నాయి. ముఖ్యంగా నిజాంసాగర్ రహదారి నుంచి వచ్చే వాహనదారులకు కామారెడ్డి వచ్చే మార్గాలు దాదాపు ముసుకుపోయే పరిస్థితి ఎదురైంది. జీవదాన్, లయోల స్కూల్ చౌరస్తా వద్ద విద్యానగర్ కాలనీ నుంచి వచ్చే నీరు రహదారిని బ్లాక్ చేసింది. దాంతో అతికష్టంగా ఒకవైపు మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. అదికూడా వాహనాల సైలెన్సర్లలోకి నీళ్లు వెళ్లి ఎక్కడ వాహనం ఆగిపోతుందోనన్న భయంతో వాహనదారులు వెళ్తున్నారు. దేవునిపల్లి నుంచి ఎన్జీఓస్ కాలనీ, విద్యానగర్ సాయిబాబా ఆలయం నుంచైనా వెళదామంటే రోడ్లపై నీరు పారుతోంది. మరోవైపు నిజాంసాగర్ చౌరస్తా వద్ద కొత్త బస్టాండ్ నుంచి వచ్చే వరద నీరు పారుతోంది. చౌరస్తా నుంచి కోర్టుకు వెళ్లే దారిలో కమాన్ ఎక్కే దారిలో నీరు నిలిచిపోయింది.
అలాగే రైల్వే కమాన్ దిగగానే పోలీస్ స్టేషన్ ముందు కార్నర్ లో నీటితో నిండిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రైల్వా స్టేషన్ రోడ్డులో నీరు నిలిచిపోయింది. జన్మభూమి రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, బతుకమ్మ కుంట, గాంధీనగర్, పాతబస్టాండ్ నుంచి అడ్లూరు వెళ్లే రోడ్డు వర్షపు నీరు, డ్రైనేజీ నీటితో నిండిపోయాయి. పలువురి ఇళ్ళల్లోకి నీళ్లు కూడా చేరినట్టుగా తెలుస్తోంది. కొట్టబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వెళ్లే అశోక్ నగర్ రహదారి గుంతలతో అద్వాన్నంగా మారింది. వినాయక నవరాత్రుల నేపథ్యంలో గుంతలతో కంకర, డస్ట్ పోసినా చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే నీటితో ఆ రహదారి నీటితో నిండిపోయింది. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.






