ఆలూరు లో పదోతరగతి పరీక్షా పత్రం లీక్

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షా పత్రం లీకైన ఘటన కల కలం రేపింది. ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో బుధవారం జరిగిన హిందీ, తెలుగు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాల ఫోటోలు బయటకు వచ్చాయ‌నే వార్త వైరల్ అయింది.

ఆలూరు లో పదోతరగతి పరీక్షా పత్రం లీక్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షా పత్రం లీకైన ఘటన కల కలం రేపింది. ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో బుధవారం జరిగిన హిందీ, తెలుగు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాల ఫోటోలు బయటకు వచ్చాయ‌నే వార్త వైరల్ అయింది. పరీక్షా కేంద్రంలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలోనే ఎవరో ప్రశ్న పత్రాలను సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి పేపర్ ను బయటి వ్యక్తులకు వాట్సప్ లో పోస్ట్ చేశారనే విషయం బయటపడింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు, పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పరీక్షా పత్రాన్ని బయటకు లీక్ చేసింది ఎవరనే అంశంపై స్కూల్ లోని సిబ్బందిని, ఇన్విజిలేటర్స్ తో పాటు పలువురిని విచారించారు. ఆర్మూర్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆలూరులో జరిగిన పేపర్ లీక్ పై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు.

డీఈఓ అశోక్ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. జిల్లాలోని 144 పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా కూడా ఇలాంటి పేపర్ లీక్ ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా పరీక్షల నిర్వహణ బాధ్యులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తెలుగు పరీక్షతో పాటు హిందీ పరీక్ష కూడా జరిగింది. రెండు పరీక్షల్లో ఏ పరీక్షకు సంబంధించిన పేపర్ బ‌య‌టికీ లీకు అయింద‌నే విషయాన్ని కచ్చితంగా అధికారులు వెల్లడించడం లేదు. బోధన్ లో కూడా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ప్రచారం జరిగినప్పటికీ దీనిపై ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఆలూరు జడ్పీహెచ్ఎస్ లో పని చేసే ఓ ఉద్యోగి ఎగ్జామ్ పేపర్ మొబైల్ ఫోన్ తో ఫోటో తీసి బయటకు లీక్ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ స్కూల్ యాజయాన్యాలతో ప్రభుత్వ టీచర్లు, విద్యాశాఖ‌కు చెందిన కొందరు ఉద్యోగులు పరీక్షా కేంద్రాల్లోనే ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్ లు ఇన్విజిలేటర్ల ద్వారానే చెప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఈ తతంగం ఎప్పటినుంచో జరుగుతోందని, రహస్యంగా ప్రతి పేపర్ ను కాన్ఫిడెన్షియల్ జిల్లాలోని పేరెన్నిక గన్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యానికి ఏదో ఒక పరీక్ష కేంద్రం నుంచి ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే 15 నిమిషాల్లోనే బయటకు వస్తుందనే కొందరు ప్రైవేట్ స్కూల్ సిబ్బందే బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. వంద శాతం రిజల్ట్స్ కోసం, ర్యాంకుల కోసం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పరీక్ష కేంద్రాల్లో డ్యూటీలు చేస్తున్న వారికి పెద్దమొత్తంలో ముట్టజెప్పి గుట్టుచప్పుడు కాకుండా వారినుండి పేపర్ లీక్ విషయంలో హెల్ప్ తీసుకుంటున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి పరీక్షలు పారద‌ర్శ‌కంగా జరిగేలా చూడాలని, సిన్సియర్ గా చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆలూరు పేపర్ లీకేజీ ఘటనలో నలుగురి సస్పెన్షన్..

చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) రాజేందర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ (డీఓ) విజయ్ కుమార్, ఇన్విజిలేటర్లు సాగర్ , ఉమెందర్ లను అధికారులు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Next Story