వ్యవసాయాధారిత పరిశ్రమలకు కేంద్రం పెద్ద పీట : ఎంపీ అరవింద్

by Chintha Aamani |   (  Updated:2025-05-05 16:48:32  IST  )

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధి

వ్యవసాయాధారిత పరిశ్రమలకు కేంద్రం పెద్ద పీట : ఎంపీ అరవింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధి పెద్దపీట వేస్తోందని, వాటి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తోందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో సోమవారం జేఎంకేపీఎం రైతు పసుపు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమను ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి వ్యవసాయాధారిత పరిశ్రమల కోసం ముందుకు వస్తే సబ్సిడీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కో ఆపరేటివ్ సెక్టార్ లో ఏర్పడే పరిశ్రమలకు ఇందూరు ప్రాంతం ఎంతో అనుకూలమని ఎంపీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలని రైతులకు ఎంపీ సూచించారు. వ్యవసాయంలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించి నిజామాబాద్ ప్రాంత రైతులు వ్యవసాయాధారిత పరిశ్రమలు కూడా నెలకొల్పి తమ సత్తాను చాటు కోవాలన్నారు.

నిజామాబాద్ ప్రాంత పసుపు రైతులకు తానిచ్చిన హామీ మేరకు జాతీయ పసుపు బోర్డును సాధించి తీసుకొచ్చానని, భవిష్యత్తులో దీని ప్రయోజనాలు చూస్తారని అర్వింద్ అన్నారు. అన్ని రకాల పంటలపై నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులకు పూర్తి అవగాహన ఉందని, ఇక్కడి రైతులు జాతీయ స్థాయిలో కూడా అద్భుతాలు సృష్టించే నైపుణ్యత కలిగిన వారున్నారన్నారు. హిందూ రాష్ట్ర స్థాపనకు నిజామాబాద్ నుంచే నుంచి పునాది పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికే ప్రమాదకారిగా మారిన టెర్రరిజాన్ని అంతమొందించడానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి కి ధీటుగా సమాధానం ఇవ్వడానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందని అరవింద్ అన్నారు. త్వరలోనే పాకిస్తాన్ కు ధీటైన జవాబు ఇవ్వనున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశ ప్రధానిగా మోడీ ఉండటం మన దేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని అర్వింద్ అన్నారు.

తెలంగాణలోని పాకిస్తానీయులను వెంటనే వారి దేశానికి పంపించేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఏ ఒక్క పాకిస్తానీయుడు మన దేశంలో ఉండకూడదన్నారు.బోధన్ పట్టణం రోహింగ్యాలకు అడ్డాగా మారిందనీ ఎంపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోధన్ ప్రాంతంలో ఒకటే ఇంటి అడ్రస్ పై సుమారు 40 కి పైగా దొంగ పాస్ పోర్ట్ తీసుకున్న విషయాన్ని ఇక్కడ అర్వింద్ గుర్తు చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఇందూరు సెగ్మెంట్ లో బీజేపీకి 70 శాతం ఓట్లు వస్తాయని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రస్తుత సమయంలో కూడా కాంగ్రెస్ రాజకీయం కోసం పాకులాడుతోందని మండి పడ్డారు. హిందువుల ప్రాణాలు అంటే మీకు లెక్క లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తో పాటు తిరుపతి రెడ్డి, ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు, పసుపు రైతులు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవాని శ్రీ, తిరుపతి రెడ్డి, ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు, పసుపు రైతులు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story