సోమార్ పేట్ ఘటన నిందితులపై కేసులు నమోదు చేయాలి

by Ratna Kumari |

దిశ, నాగిరెడ్డిపేట్ : (ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట గ్రామ మహిళలపై ట్రాక్టర్ దాడి ఘటనలో బాధ్యులైన వ్యక్తులతో పాటు దాడికి

సోమార్ పేట్ ఘటన నిందితులపై కేసులు నమోదు చేయాలి
X

దిశ, నాగిరెడ్డిపేట్ : (ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట గ్రామ మహిళలపై ట్రాక్టర్ దాడి ఘటనలో బాధ్యులైన వ్యక్తులతో పాటు దాడికి ప్రేరేపించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట గ్రామంలో గత సోమవారం సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి బిట్ల బాల్ రాజ్ ఇంటిపై ట్రాక్టర్ తో దాడి చేసిన ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణ బందు తో పాటు అఖిలపక్షం నాయకులు భారీ ధర్నా చేపట్టారు. అఖిలపక్షం నాయకులు బైకులపై ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీస్తూ సోమార్ పేట ఘటన దాడి నిందితులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాజీ ఎంపీ బీబీ పాటిల్, బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి లు మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాతి రోజూనే నూతనంగా ఎన్నికైన ఆ గ్రామ సర్పంచ్ కురుమ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి ఉద్దేశపూర్వకంగా సర్పంచ్ గా ఓడిపోయిన అభ్యర్థి బిట్ల బాలరాజు కుటుంబ సభ్యులు, ఇతర మహిళలపై దాడి చేశారన్నారు.


అకారణంగా ట్రాక్టర్ తో ఢీ కొట్టిన ఘటనలో కేవలం కురుమ చిరంజీవి మీద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ ట్రాక్టర్ దాడి ఘటనకు ప్రేరేపించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా తో పాటు ఇతర వ్యక్తులపై సైతం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో గాయపడిన క్షతగాత్రులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, చికిత్స పొందుతున్న వారికి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా అఖిలపక్షం బందుకు పట్టణ వాణిజ్య వ్యాపార సముదాయాలతో పాటు, ప్రైవెట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, సోమార్ పేట్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story