పురుగు మందు కొంటేనే యూరియా!

by Ajay Maddhiboyina |

ఆరుగాలం కష్టపడి పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఒకవైపు వాతావరణం సహకరించక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకుల తీరు మరింత నష్టాన్ని కలిగిస్తోంది.

పురుగు మందు కొంటేనే యూరియా!
X

దిశ, కామారెడ్డి : ఆరుగాలం కష్టపడి పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఒకవైపు వాతావరణం సహకరించక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకుల తీరు మరింత నష్టాన్ని కలిగిస్తోంది. రైతుకు అవసరమైన వాటిని తీసుకునే స్వేచ్ఛ కూడా షాపుల వాళ్ళు ఇవ్వడం లేదు. అవసరం లేకున్నా ఇతర మందులను అంటగడుతూ అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యూరియా కావాలంటే పురుగుల మందు కొనాల్సిందే అంటూ బలవంతంగా రైతులకు అంటగడుతున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు అని కలెక్టర్ చెప్పి 24 గంటలు కూడా గడవకముందే మన గ్రోమోర్ నిర్వాహకుల తీరు బయటపడటం గమనార్హం.

కలెక్టర్ ఆదేశించి 24 గంటలు కూడా గడవక ముందే...

యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అదేశించి 24 గంటలు కూడా గడవకముందే అన్నదాతలకు అనవసరంగా పురుగుల మందు అంటగట్టిన ఘటన కామారెడ్డిలో వెలుగు చూసింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మంచాల పెద్ద మల్లేష్, మంచాల చిన్న మల్లేష్ లు కామారెడ్డిలోని మన గ్రోమోర్ లో యూరియా తీసుకోవడానికి వచ్చారు. ఒక్కో యూరియా బస్తా ధర 271 కావడంతో రూ.1897 అవుతుంది. అయితే గ్రోమోర్ నిర్వాహకులు ఇక్కడే తమ బిజినెస్ ఆలోచనకు పదునుపెట్టారు. సదరు రైతులకు పురుగుల మందులు కొంటేనే యూరియా ఇస్తామని కండిషన్ పెట్టారు. లేకపోతే యూరియా లేదని చెప్పడంతో 3 వేలు పెట్టి పురుగుల మందులు తీసుకున్నారు. నిజానికి ఆ రైతులకు పురుగుల మందు అవసరం లేదు. అయినా బలవంతంగా అంటగట్టారని రైతులు వాపోయారు.

కొనుగోలు ఎరువులకు బిల్లులు నిల్

రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, పురుగు మందులకు సంబంధించిన బిల్లులు ఇవ్వాల్సి ఉండగా అవేమీ లేకుండానే విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. లింగాపూర్ కు చెందిన రైతులు గ్రోమోర్ లో 5 వేలు చెల్లించి ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయగా వీటికి సంబంధించిన బిల్లు ఇవ్వలేదు. తీరా ఇంటికి వెళ్ళాక 7208 రూపాయల ఫర్టిలైజర్ కొనుగోలు చేసినట్టుగా తమ ఫోన్ కు మెసేజ్ వచ్చిందని తెలిపారు. యూరియా కోసం వచ్చే ప్రతి రైతు పరిస్థితి ఇదేనని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

ఎరువులతో పాటు పురుగుమందులు అమ్మితేనే సంస్థకు లాభం

రైతులకు బలవంతంగా పురుగు మందులు అంటగట్టిన విషయమై గ్రోమోర్ నిర్వాహకులను వివరణ కోరగా తాము ఎలాంటి పురుగు మందులు రైతులకు అంటగట్టలేదని తెలిపారు. రైతులకు ఏది అవసరమో అదే ఇస్తామని పేర్కొన్నారు. పైగా ఎరువులతో పాటు పురుగుమందులు కూడా విక్రయిస్తేనే మా సంస్థ నడుస్తుందని, మాకు జీతాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం.

ఒకరి బిల్లు మరొకరికి...

బిల్లు విషయమై అడిగే సమయంలో మండల వ్యవసాయ అదికారి పవన్ కుమార్ గ్రోమోర్ కు రావడంతో బిల్లు విషయమై నిర్వాహకులను ప్రశ్నించారు. రైతు ఫోన్ నంబర్ ఆధారంగా బిల్లు ప్రింట్ తీయగా అదనంగా 2 వేల పై చిలుకు బిల్లు ఉంది. ఇదేంటని ప్రశ్నించగా మరొక రైతుకు సంబందించిన పురుగుల మందు డబ్బా బిల్లు ఈ రైతు బిల్లులో యాడ్ చేవడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఒక రైతు బిల్లులో మరొకరి బిల్లు చేర్చడం ఏమిటని ఏవో ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అవసరం లేకున్నా మందులు అంటగట్టిన విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిస్తామని ఏవో తెలిపారు. పురుగు మందులు రైతుకు బలవంతంగా అంటగట్టిన విషయంతో పాటు బిల్లు ఇవ్వని విషయమై నోటీసులు జారీ చేస్తున్నామని, దీనికి సంబంధించిన వివరణ మేనేజర్ తో ఇవ్వాలని ఏవో నిర్వాహకులను ఆదేశించారు

కలెక్టర్ ఆదేశాలు బుట్ట దాఖలు

రైతులు అడిగిన ఎరువులు, పురుగు మందులు మాత్రమే విక్రయించాలని, వారికి ఇష్టం లేకుండా ఎలాంటి మందులు బలవంతంగా అంటగట్ట రాదని కలెక్టర్ ఆదేశించి 24 గంటలుగా గడవకముందే ఆయన ఆదేశాలను మన గ్రోమోర్ నిర్వాహకులు బుట్ట దాఖలు చేశారు. ఇలాంటి నిర్వాహకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని రైతులు అంటున్నారు.

Next Story