తప్పు చేసే అధికారులకు చట్టం ద్వారానే చర్యలు : మంత్రి పొంగులేటి

by Bhanu |   (  Updated:2025-04-29 10:51:59  IST  )

ఉద్దేశ్యపూర్వకంగా అధికారులు తప్పు చేస్తే భూ భారతి చట్టం ద్వారానే చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

తప్పు చేసే అధికారులకు చట్టం ద్వారానే చర్యలు : మంత్రి పొంగులేటి
X

దిశ, కామారెడ్డి/లింగంపేట్ : ఉద్దేశ్యపూర్వకంగా అధికారులు తప్పు చేస్తే భూ భారతి చట్టం ద్వారానే చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆయన భూభారతి అవగాహన సదస్సులో భాగంగా ఫైలట్ మండలంగా ఎంపికైన లింగంపేట మండలం షెట్పల్లి గ్రామంలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ. దేశంలోని 18 రాష్ట్రాలకు అధికారులను పంపించి అక్కడ అమలయ్యే రెవిన్యూ అంశాలను పరిగణలోకి తీసుకుని భూ భారతి చట్టాన్ని 9 నెలల మేథోమధనం తర్వాత మేధావుల సూచనలు, సలహాలతో అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ చట్టం అమలైతే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని నాటి ప్రబుద్దులు బిల్లు పాస్ కాకుండా చూసారన్నారు.


నాటి చట్టానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవని, దొరకు ఏది అనిపిస్తే అదే రూల్ అమలు చేసారని విమర్శించారు. భూ భారతి 2020 చట్టం భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రూపొందించడం జరిగిందని తెలిపారు. జిల్లాకు ఒక మండలాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందని, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచన మేరకే లింగంపేట మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. గతంలో అధికారుల చుట్టూ రైతులు తిరిగేవారని, ఇప్పుడే అధికారులే గ్రామాలకు వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మనడలంలోని 23 గ్రామాల్లో 20 గ్రామాల్లో తహసీల్దార్ స్థాయి అధికారి వచ్చి సమస్యలు తెలుసుకున్నారని, రెండు రోజుల్లో మిగిలిన గ్రామాలలో సమస్యలు తెలుసుకుంటారని, ఇప్పటికే 3400 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సిసిఎల్ఏ స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని, అవసరం అయితే స్పెషల్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసేలా చట్టంలో పొందుపరచడం జరిగిందన్నారు.

తహసీల్దార్, ఆర్డీఓ, ఏ రెవెన్యూ అధికారి అయినా ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేస్తే రెవిన్యూ పరిధిలోనే సమస్య పరిష్కరిస్తారన్నారు. నాడు విఆర్ఓ, వీఆర్ఏ లు చెప్పినట్టు వినలేదని అర్ధరాత్రి గట్టుమీద వదిలేసారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 10956 గ్రామాల్లో రెవిన్యూ అధికారులను పది, పదిహేను రోజుల్లోనే నియమిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో సర్వేయర్ల కొరత ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 380 మంది సర్వేయర్ల మాత్రమే ఉన్నారని, కొత్తగా 6 వేల మంది సర్వేయర్లను పెట్టబోతున్నామన్నారు. భవిష్యత్తులో భూముల అమ్మకాల విషయంలో ఇబ్బందులు రాకుండా మ్యాపింగ్ చేసే అంశాన్ని చట్టంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తమ ప్రభుత్వం చేస్తుందని దొరకు కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, రాజీవ్ యువ వికాసం ద్వారా జిల్లాకు మూడు నాలుగు వేల మంది యువతకు 50 వేల నుంచి 5 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నామన్నారు. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రతి పేదోడి కష్టం తీర్చేలా, హామీలు అమలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎంపీ సురేష్ షెట్కార్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


Next Story