బ్యాంకర్ల కండీషన్.. ఫుల్ పేమెంట్ కడితే లోన్ రెన్యూవల్..

by I. Sairam |

ప్రభుత్వం నుంచి సకాలంలో అందాల్సిన పెట్టుబడి సాయం అందక పోవడంతో చేసేది లేక రైతులు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు.

బ్యాంకర్ల కండీషన్.. ఫుల్ పేమెంట్ కడితే లోన్ రెన్యూవల్..
X

దిశ, భిక్కనూరు: ప్రభుత్వం నుంచి సకాలంలో అందాల్సిన పెట్టుబడి సాయం అందక పోవడంతో చేసేది లేక రైతులు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక బయట వడ్డీకి అప్పులు పుట్టక, పంట పెట్టుబడి కోసం విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన లోన్ డబ్బులతో వ్యవసాయం చేస్తున్నారు. లోన్ ద్వారా వచ్చిన డబ్బులతో కొంత మేర ఎమర్జెన్సీ ఫండ్ లాగా దాచుకుంటున్నారు. బంగారం ధర పెరిగినా కొద్ది డబ్బు అవసరాలు కూడా పెరుగుతుండడంతో చాలామంది రైతులు సమీపంలోని బ్యాంకులకు వెళ్లి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బ్యాంకర్లు ఈమధ్య కొత్తగా తీసుకున్న రుణాలను వాయిదా దాటిన తర్వాత రెన్యువల్ చేయాలంటే వడ్డీతో సహా తీసుకున్న లోన్ డబ్బులు కూడా పూర్తిగా చెల్లించాలని కండీషన్ పెడుతున్నారు. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ కండీషన్ పెట్టడం రుణ గ్రహీతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చేతిలో డబ్బులు లేక పోవడంతోనే బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే రైతులను ఫుల్ పేమెంట్ కట్టాలంటే ఎక్కడ నుంచి కడతామంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఫుల్ పేమెంట్ కడితేనే రెన్యువల్ చేస్తామంటే మా రైతుల పరిస్థితి ఏందని వాపోతున్నారు. చాలా మంది రైతులు ఫుల్ పేమెంట్ కట్టేందుకు చేతిలో డబ్బులు లేక, ఫైన్ లు బాగా పడతాయన్న భయంతో వడ్డీ వ్యాపారులను, మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు.

గంటల వ్యవధికి అధిక వడ్డీ మోతలు..

దీంతో బ్యాంకర్ల కండీషన్లు, రైతుల బలహీన పరిస్థితిని ఆసరాగా చేసుకున్న వడ్డీ వ్యాపారులు దీన్ని చక్కని అవకాశంగా వాడుకుంటున్నారు. గంటల వ్యవధి కోసమే అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ రైతులకు వడ్డీలకు డబ్బులిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న డబ్బులను తీసుకెళ్‌లి బ్యాంకులో చెల్లించి మళ్లీ వెంటనే కొత్తగా రెన్యూవల్ లోన్ తీసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చిన డబ్బులకు రూ.1000ల నుంచి రూ. 2000 ల వరకు రైతులకు అదనంగా వడ్డీ భారం పడుతుండటంతో పాటు, బ్యాంకులో లోన్ రెన్యువల్ చేయడానికి రూ.600ల వరకు ఖర్చవుతోందని గోల్డ్ లోన్ తీసుకుంటున్న రైతులు లబోదిబోమంటున్నారు.

క్యాష్ లేకనే..

తమ వద్ద అంత లోన్ డబ్బులు పూర్తిగా చెల్లించే స్థోమత లేకనే లోన్ తీసుకుంటున్నామని, ఈ విషయాన్ని బ్యాంకర్లు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని రైతులు ఆవేధనతో పాటు ఆక్రోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల క్యాష్ తమ వద్దే ఉంటే బంగారం తనఖా పెట్టి గోల్డ్ లోన్ ఎందుకు తీసుకుంటామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 1.50 లక్షలకు పైగా పలుకుతుండగా, లోన్ తీసుకుంటే బ్యాంకు నుంచి బంగారు ఆభరణాలకు మార్కెట్ ధరలో 85 శాతం మాత్రమే డబ్బులు లెక్క కట్టి చెల్లిస్తున్నారు. మిగతా అమౌంట్ కు సంబంధించి బంగారు ఆభరణాలు బ్యాంకర్ల వద్ద ఉండగా, ఫుల్ పేమెంట్ కడితేనే లోన్ రెన్యువల్ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని రైతులు కొందరు రైతులు వాదిస్తున్నారు. ఈ విధంగా కండిషన్లు పెట్టడం కారణంగా బ్యాంకుల వద్ద కొందరు మధ్య దళారుల అవతారం ఎత్తి బ్యాంకులలో పనిచేసే కొందరు సిబ్బందితో కమిట్మెంట్అయి దళారీ బిజినెస్ కు తెర లేపారన్న ప్రచారం జరుగుతోంది.

వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకే..

బ్యాంకులో బంగారం పై వడ్డీ రేటు తక్కువ పడుతుందన్న ఉద్దేశంతో వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిందని తెలుస్తోంది. ఒక్కో వడ్డీ వ్యాపారి అమాయకులైన ప్రజల నుంచి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకొని, వారి అవసరాలను బట్టి రెండున్నర నుంచి మూడు రూపాయలకు పైగా వడ్డీకి ఇస్తూ పెద్ద మొత్తంలో వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకులలో కుదవ పెట్టి వచ్చిన డబ్బులను మళ్లీ రైతులకే మిత్తికి ఇస్తున్నారు. దీంతో బ్యాంకులలో గోల్డ్ లోన్ ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడంతో, పోయిన సంవత్సరం నుంచి కొత్త నిబంధన లను అర్బీఐ అమల్లోకి తేవడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా పరిణమించింది. వారిని కట్టడి చేయడం ఏమో కాని, గోల్డ్ లోన్ తీసుకున్న పాపానికి మొత్తం లోన్ డబ్బులు ఏకకాలంలో కట్టలేక రైతులు నానా హైరానాకు గురవుతున్నారు.

ధర్నాకు సిద్ధమవుతున్న రైతులు..

గోల్డ్ లోన్ కు సంబంధించిన వడ్డీ డబ్బులు మాత్రమే చెల్లిస్తే గోల్డ్ లోన్ రెన్యూవల్ చేసే విధంగా బ్యాంకర్లు వెసులు బాటు ఇవ్వాలని, ప్రభుత్వం కూడా ఆ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వడ్డీతో పాటు లోన్ డబ్బులు కూడా చెల్లించాలనే కండీషన్ ఇలాగే కొనసాగితే అన్ని బ్యాంకుల ఎదుట రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే, బలవంతపు చెల్‌లింపుల కోసం ఒత్తిడి చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేయాలని బాధిత రైతులు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మాదిరిగా గోల్డ్ రుణాలను రెన్యూవల్ చేసే విధంగా ప్రభుత్వంపై తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

Next Story