రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఆ జిల్లాలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

by Jakkula.Mamatha |

జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఆ జిల్లాలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు
X

దిశ, కామారెడ్డి : జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గురువారం నుంచి 5 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించిందన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాలతో కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలని కోరారు.

ముంపునకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్ ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిసిపోయిన పాత ఇండ్లు, భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అదే విధంగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చేపలు పట్టుటకు, పశువులు, గొర్రెలను నీటి వనరుల వద్దకు తీసుకొని వెళ్లరాదని సూచించారు. ప్రభుత్వ అధికారుల సూచనలను పాటిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468- 220069కు సమాచారం అందించి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Next Story