- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో ఏసీబీ తనిఖీ.. ప్రభుత్వానికి భారీ నష్టం..!
కామారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై శాఖలో అక్రమాలకు పాల్పడటంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు గుర్తించారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్ లోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు కొనసాగిన తనిఖీలలో అనేక లోపాలు బయటపడ్డాయి. ఈ మేరకు తాజాగా ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించారు. తనిఖీలో అనేక లోపాలు బయటపడ్డాయని ఏసీబీ పేర్కొంది. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో 39 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారని, 2 రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోగా 581 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని.. దీని విలువ రూ.64 లక్షలు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. 2022-23 ఖరీఫ్ సీజన్‌లో 37 మంది మిల్లర్లు డిఫాల్ట్ కాగా, 2 రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఫలితంగా 19,529 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని, దీని విలువ రూ.41 కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌లో 7 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయినా ముగ్గురు రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకున్నారని, ఫలితంగా 5,194 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడగా దీని విలువ రూ.2.5 కోట్లు ఉన్నట్టుగా తెలిపారు. 2023-24లో గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ కస్టమ్ మిల్డ్ రైస్‌పై డిఫాల్ట్ చేసిందని, ఇది క్రిమినల్ కేసుకు దారితీసిందని, అయినప్పటికీ అధికారులు ఖరీఫ్, రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయించారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2025 నుంచి జిల్లా పౌర సరఫరా అధికారి, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్, కామారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్లు, బియ్యం మిల్లులను తనిఖీలు చేయలేదని గుర్తించారు. జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉన్న సిబ్బందిలో ఒకరు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు ప్రస్తుతం అతనిపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఇంత పెద్ద లోపం ఉన్నప్పటికీ జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, డిప్యూటీ తహశీల్దార్లు డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించబడుతుందన్నారు.






