- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూటర్న్ కోసం టోల్ ప్లాజా వరకు తప్పని ప్రయాణం
యూటర్న్ కోసం ఆరు కిలోమీటర్ల అదనపు జర్నీ చేస్తూ గత రెండేళ్లుగా ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, భిక్కనూరు : యూటర్న్ కోసం ఆరు కిలోమీటర్ల అదనపు జర్నీ చేస్తూ గత రెండేళ్లుగా ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ, బీబీపేట మండలాలకు చెందిన ప్రయాణికులే కాకుండా, సిద్దిపేట జిల్లా దుబ్బాక, రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లే ప్రయాణికులతో పాటు విద్యార్థులు అదనపు దూరాన్ని భరించలేక అవస్థలు పడుతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో రెండు సైడ్ల వైపు ఉన్న యూటర్స్‌ను చాలా రోజుల కింది మూసివేశారు.
దీంతో అప్పటి నుంచి, బీబీపేట, దోమకొండ, రూట్లలో నడిచే బస్సులన్నీ వయా భిక్కనూరు టోల్ ప్లాజా వరకు చేరుకొని, అక్కడ యూటర్న్ తీసుకొని కామారెడ్డి వైపు వెళ్తుండటంతో, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేవారు ఈ అదనపు దూరాన్ని భరించలేకపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు మూడు కిలోమీటర్ల దూరం వచ్చి, రోడ్డు క్రాస్ చేసుకుని వెళ్తుండటంతో ఆ రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. ఆర్టీసీ బస్సులకు కూడా డీజిల్ ఎక్కువగా ఖర్చవుతుండడం, ఆ మార్గంలో నడిచే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు సైతం ఈ పరిస్థితి తప్పడం లేదు.
రాంగ్ రూట్లోనే వాహనాలు..
ఆర్టీసీ బస్సులు మినహా, దాదాపు ప్రైవేటు వాహనాలు అన్నీ రాంగ్ రూట్లోనే కామారెడ్డి వెళ్తున్నాయి. దోమకొండ సైడ్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు ఎక్కువ శాతం బీటీఎస్ చౌరస్తా నుంచి రాంగ్ రూట్లోనే ఎక్కువగా వెళ్తుండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా బాగానే జరుగుతున్నాయి. వారం పది రోజుల కింద కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లికి చెందిన తండ్రి, కూతురుతోపాటు ఇద్దరు మనువలను ఎలక్ట్రిక్ స్కూటీపై ఎక్కించుకొని టీకాలు వేయించేందుకు భిక్కనూరుకు వస్తున్నారు. అయితే 44వ హైవే నుంచి జంగంపల్లి బస్టాండ్ వద్దకు రాగానే రాంగ్ రూట్లో బీటీఎస్ చౌరస్తా నుంచి వస్తున్న మొరం టిప్పర్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన విషయం విధితమే. అయితే చిన్న చితక ప్రమాదాలు సహజంగా జరుగుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోని ప్రజలు, మరిన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందేమోననే భయం హైవేపై ప్రయాణం చేసే వారిలో నెలకొన్నది. ముఖ్యంగా చౌరస్తాలో రాత్రివేళ లైటింగ్ వెలగ లేకపోవడంతో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.
బ్రిడ్జి నిర్మాణం తోనే సమస్యకు పరిష్కారం..
భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తా వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదని పలువురు వాపోతున్నారు. హైవే విస్తరణ పనులు చేపట్టే సమయంలోనే మరింత హైట్ పెంచి, అప్పట్లోనే బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న వాదనను ప్రయాణికులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా హైవే ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఈ మార్గంలో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రమాదాలు జరగకుండా నివారించగలిగిన వారవుతారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






