​టార్పాలిన్ల కింద భవిత.. పల్లెగడ్డ తండా బడి దుస్థితి..!

by Kodari Anjali |

ఎండైనా, వానైనా పల్లెగడ్డ తండా విద్యార్థులకు టార్పాలిన్లే దిక్కుగా మారాయి.

​టార్పాలిన్ల కింద భవిత.. పల్లెగడ్డ తండా బడి దుస్థితి..!
X

దిశ, తాడ్వాయి: చదువుల గుడిలో అక్షరాలు దిద్దాల్సిన ఆ చిన్నారులు... ఇప్పుడు ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా నల్లటి టార్పాలిన్ కవర్ల నీడన దుర్భర పరిస్థితుల్లో బతుకు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంత కాదండోయ్.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని పల్లెగడ్డ తండాలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రం ఆ చదువు కూడా కన్నీటితో కూడిన కష్టంగా మారింది. ప్రభుత్వలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నామంటున్న మన కాలంలో,విద్యావ్యవస్థ దయనీయ స్థితికి ఈ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న దృశ్యమె నిలువెత్తు నిదర్శనం.​

పత్రికల్లో కథనాలు వస్తున్నా...అధికారుల్లో, నాయకుల్లో చలనం లేదా?

​ప్రగతి పథంలో దూసుకుపోతున్నామంటున్న మన కాలంలో, విద్యావ్యవస్థ దయనీయ స్థితికి ఈ దృష్టాంతమే నిలువెత్తు నిదర్శనం. గతంలో ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 43 మంది ఉండగా, సరైన గది లేకపోవడంతో కొందరు ప్రయివేట్ బాట పట్టగా.. ఇక మిగిలిoది కేవలం 26 మంది మాత్రమే బడికి వస్తున్నారు.వారి చదువును ముందుకు నడిపించడానికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, పిల్లలకు జ్ఞానాన్ని పంచాల్సిన బడి గది మాత్రం ఏళ్ల తరబడి అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఈ దుస్థితిపై పత్రికల్లో ఎన్నిసార్లు వార్తలు వస్తున్నా, ప్రజాప్రతినిధులలో గానీ, అధికారులలో గానీ కనీస చలనం రాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​మాజీ ఐఏఎస్ చూసినా మారదెందుకో?..

​2021లో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి,ఇతర అధికారులు పల్లెగడ్డ తండాలో బస చేశారు. ఆ సమయంలో అక్కడి దుర్భర పరిస్థితిని స్వయంగా చూసిన ఆయన చొరవతో 2022లో పాఠశాల భవనం శాంక్షన్ అయింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం,నిధుల కొరత ఏర్పడడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అప్పట్లో పెద్దఎత్తున అధికారులు బస చేసి సమస్యను ప్రత్యక్షంగా చూసినప్పటికీ,నేటికీ ఆ పాఠశాల తీరు మాత్రం మారలేదు. కేవలం పిల్లల వరకు మాత్రమే నిలబడిన ఆ పునాదిపై పనులు ముందుకు సాగలేదు.

​తాటిపత్రి చాటున తలరాతలు...

​భవనం లేదు కదా అని విద్య ఆగుతుందా? చదువుపై ఆశతో ఆ చిన్నారులు బడికి వస్తున్నారు. కానీ,ఆ చుట్టూ తాటిపత్రి మధ్య వర్షం, చలి, ఎండతో సంబంధం లేకుండా పిల్లలు తమను తాము కాపాడుకోవడానికి పిల్లర్ల చుట్టూ తాటీపత్రి కాగితాలు కట్టుకొని తరగతి గదులుగా మార్చుకున్నారు. చలిలో వణికిపోతూ.. వానకు తడుస్తూ చదువుతున్న ఆ పసిపిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

​తల్లిదండ్రుల ఆవేదన...

​రేపటి భారతదేశాన్ని నిర్మించాల్సిన చిన్నారుల భవిష్యత్తు... నేడు ఇలా టార్పాలిన్ నీడన ప్రశ్నార్థకంగా మారింది. ఒకసారి మాజీ ఐఏఎస్ అధికారే స్వయంగా బస చేసిన తండాలో పరిస్థితి ఇంత దయనీయంగా ఉందంటే క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీనత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.​ ఇప్పటికైనా పాలకుల గుండెల్లో కదలిక రావాలి..! నిద్రమత్తులో ఉన్న అధికారుల తీరు మారాలి..! ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి... ఆగిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే పునరుద్ధరించి, విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన తరగతి గదులను అందించాలని తండా ప్రజలు, తల్లిదండ్రులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story