TS iPASS‌కు నీతి ఆయోగ్ ప్రశంసలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన TS iPASS విధానాన్ని నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో దేశంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక అనుమతుల వ్యవస్థగా ప్రశంసించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

TS iPASS‌కు నీతి ఆయోగ్ ప్రశంసలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన TS iPASS విధానాన్ని నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో దేశంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక అనుమతుల వ్యవస్థగా ప్రశంసించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన విస్తృతమైన ట్వీట్ చేస్తూ, ఈ గుర్తింపు యావత్ తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న దూరదృష్టితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన TS iPASS విధానం, పదేళ్లలోనే తెలంగాణను దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా నిలిపిందని కేటీఆర్ తెలిపారు. ఈ విధానం జాతీయ స్థాయిలో అందరికీ అనుసరణీయమని నీతి ఆయోగ్ పేర్కొనడం కేసీఆర్ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే..

భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈ విభాగంలో రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25 లక్షల మందికి పైగా యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే అనేక అడ్డంకులను పూర్తిగా తొలగించి, సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేయడమే కాకుండా, అవినీతికి ఏమాత్రం తావులేని పారదర్శక విధానాన్ని రూపొందించి, దశాబ్దకాలంపాటు అదే చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లే ఈ జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమైందని తెలిపారు.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో..

ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల వరకు అందరూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం TS iPASS‌పై పెట్టుబడిదారుల్లో ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. పదేళ్లు గడిచినా ఈ విధానం ప్రతిష్ట నలుదిశలా మారుమోగుతూనే ఉందని పేర్కొన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీహబ్ వంటి వినూత్న కార్యక్రమాలతో పాటు పారిశ్రామిక ప్రగతిలోనూ తెలంగాణ మోడల్‌నే ఆచరణీయమని నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో ఉన్న శక్తులు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story