- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పాదయాత్ర నిర్ణయంతో మొద్దు నిద్ర లేచారు
పాలమూరుపై రెండున్నరేళ్లకు కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిచిందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఎట్టకేలకు కండ్లు తెరిచిన కాంగ్రెస్ సర్కార్
- బీఆర్ఎస్ పాదయాత్ర నిర్ణయంతో మొద్దు నిద్ర లేచారు
- పాలమూరు పూర్తికి రెండున్నరేళ్లు సమయం వృథా
- మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరుపై రెండున్నరేళ్లకు కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిచిందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వం మొద్దు నిద్రలేచిందని తెలిపారు. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయం వృథా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతున్నదని తెలిపారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ఒక్కనాడు పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్‌తోపాటు ఏదుల, వట్టెం, కరివెనలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపుకునే అవకాశం ఉండేదని తెలిపారు. రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనులను పడావు పెట్టడంపై త్వరలో నార్లాపూర్ నుండి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కేసీఆర్‌ను తీసుకురావాలని ప్రతిపాదన చేశామని తెలిపారు. రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష చేశారని తెలిపారు. ఈ సమీక్ష మొక్కుబడిగా అన్న విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలని సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని.. మొత్తం 5 మోటార్లు నడిచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నార్లాపూర్-ఏదుల-వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పనులు చేపట్టే వరకూ బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదని.. ప్రభుత్వ నిర్వకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.






