- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: పురుగు మందులపై పరిశోధనల పేరుతో కొందరు శాస్త్రవేత్తలు నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐసీఎంఆర్ ఫండ్స్ తో ఎన్ఐఎన్ సైంటిస్టులు రీసెర్చ్ పేరిట ప్రచురించిన జర్నల్స్ నకిలీ, తప్పుడు సమాచారంతో నిండి ఉన్నాయని ముంబైకి చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ అగ్రికల్చర్ (సెంటిగ్రో) అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించి ఆధారాలతో సహా ఈ అవినీతిని బయటపెట్టింది. అయితే దీనిపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
తప్పుడు సమాచారంతో ‘జర్నల్స్’!
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఆర్గానో ఫాస్ఫేట్ క్రిమిసంహారక మందుల ప్రభావానికి గురైన మొక్కల న్యూరో బిహేవియరల్, బయోజెనిక్ అమైన్ల వ్యక్తీకరణలపై పరిశోధన చేయడానికి జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)కు చెందిన సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఎన్ సిన్హాకు రూ.41.47 లక్షలను ఐసీఎంఆర్ కేటాయించింది. ఆయన తన జూనియర్ అయిన, ఓయూలో పీహెచ్ డీ చేస్తున్న దిలేశ్వర్ కుమార్ తో కలిసి ఆరు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. అయితే ఆ పత్రాలు నకిలీ, తప్పుడు సమాచారంతో నిండి ఉన్నాయని సెంటిగ్రో ఆరోపించింది. వీటికి సంబంధించిన ఆధారాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది.
ఈ నివేదికలు ప్రాథమిక పరిశీలనకు కూడా నిలబడవని, విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన శాస్త్రీయ నియమాలు, సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని సెంటిగ్రో బలమైన సాక్ష్యాలను అందించింది. ఆ తర్వాత ఎన్ఐఎన్ తాను ప్రచురించిన ఆరు పరిశోధక పత్రాల్లో (జర్నల్స్) ఒకదాన్ని ఉపసంహరించుకుంది. మిగతా ఐదింటిని కూడా ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆ పరిశోధనలు నిజమని నిరూపించాలని సెంటిగ్రో కోరుతోంది. మరోవైపు పక్కా ఆధారాలను పరిశీలించిన తర్వాత కూడా ఐసీఎంఆర్, ఎన్ఐఎన్, ఉస్మానియా వర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండడం సరికాదని సెంటిగ్రో పేర్కొంటున్నది.
చర్యలకు డిమాండ్
ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచే వాటికి నిధులు సమకూరుతాయి. పరిశోధనకు కేటాయించిన రూ.41.47 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని, తప్పుడు సమాచారంతో జర్నల్స్ రూపొందించారని రెండు సంస్థలకూ తెలుసని సెంటిగ్రో పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ మోసాన్ని క్రిమినల్, ఆర్థిక నేరంగా పరిగణించాలని, చట్ట ప్రకారం శిక్షించాలని అధికారులను కోరుతోంది. 2016లో చండీగఢ్ కు చెందిన ఇద్దరు సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలను శాస్త్రీయ దుష్ప్రవర్తన కారణంగా విధుల నుంచి తొలగించారని, ఐసీఎంఆర్-ఎన్ఐఎన్‌లో జరిగిన మోసానికి పాల్పడిన శాస్త్రవేత్తలపైనా ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలని సెంటిగ్రో విజ్ఞప్తి చేస్తున్నది.
అంతే కాకుండా దిలేశ్వర్ కుమార్‌కు సీఎస్ఐఆర్ ఫెలోషిప్ లభించినట్లుగా ఆధారాలు ఉన్నాయంటే, మోసపూరిత పరిశోధనకు ప్రభుత్వ సంస్థలైన ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్‌ల మద్దతు ఆయనకు లభించిందని సెంటిగ్రో ఆరోపిస్తోంది. దీనిపై వెంటనే తగిన దర్యాప్తు జరిపించి, ప్రజలకు సైన్స్ పై ఉన్న నమ్మకాన్ని తప్పుడు నివేదికలతో చెడగొట్టినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరినట్లు తెలిపింది. అలాగే గవర్నర్, ఉస్మానియా వర్సిటీ చాన్స్‌లర్ అయిన జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని దిలేశ్వర్ కుమార్‌కు ఓయూ నుంచి పీహెచ్‌డీ మంజూరు కాకుండా ఆపాలని సెంటిగ్రో విజ్ఞప్తి చేసింది.






