- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NIMS: ఇంకా విషమంగానే కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి : నిమ్స్ వైద్యులు
ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లలో బాండ్ సిస్టమ్ అమలు అనైతికమని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు, స్కూళ్లలో బాండ్ సిస్టమ్ అమలు అనైతికమని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల నుంచి సర్వీస్ బాండ్లు తీసుకోవడం, వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేసి అనుబంధ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులుగా పని చేయాలని బలవంతం చేయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొంది. ఈ తరహా చర్యలు విద్యార్థుల స్వేచ్ఛ కు విరుద్ధమని, నైతిక విలువలకు భంగం కలిగించేవని కౌన్సిల్ అభిప్రాయపడింది. బాండ్ విధానం అమలు చేస్తూ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వకపోతే, సంబంధిత సంస్థలపై ఐఎన్‌సీ చట్టం సెక్షన్–14 కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నర్సింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులేషన్-2020, గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం ఇలాంటి బాండ్ విధానం నిషేధితమని కౌన్సిల్ మరోసారి గుర్తు చేసింది. ఈ విషయంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తప్పిదానికి పాల్పడిన నర్సింగ్ సంస్థలపై తగిన చర్యలు తప్పవని పేర్కొంది.
ఇంకా విషమ స్థితిలోనే కానిస్టేబుల్ సౌమ్య
నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జనవరి 25న అర్ధరాత్రి 1.40 గంటలకు అత్యవసర పరిస్థితిలో సౌమ్యను నిమ్స్‌కు తరలించగా, వెంటిలేటర్ సహాయంతో చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలోని రికవరీ ఐసీయూ బెడ్ నెంబర్-3లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం స్పృహలోకి వచ్చే ఆదేశాలను అనుసరిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. గ్లాస్గో కోమా స్కేల్ స్కోర్ మెరుగుపడిందని, పల్స్ రేటు, రక్తపోటు క్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. నోరాడ్రెనలిన్, వాసోప్రెస్సిన్ వంటి మందులతో పాటు అవసరమైన వైద్య మద్దతు కొనసాగుతోందన్నారు. కిడ్నీ పనితీరుకు సహాయంగా సీఆర్‌ఆర్‌టీ (కంటిన్యూయస్ రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ) అందిస్తున్నామని తెలిపారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో కాలేయానికి గాయం ఉన్నట్లు నిర్ధారణ కాగా, గుండె పనితీరు సక్రమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటికే రక్తం, ప్లేట్లెట్లు, ఎఫ్‌ఎఫ్‌పీ యూనిట్లు అందించినట్లు వెల్లడించారు. వెంటిలేటర్‌పై 30 శాతం ఆక్సిజన్‌తో చికిత్స కొనసాగుతుండగా, ఆక్సిజన్ సాచురేషన్ 100 శాతం ఉన్నట్లు తెలిపారు. అన్ని శాఖల వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్న ప్పటికీ, సౌమ్య ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు.






