మంగోలియా వేదికపై మెరిసిన నిఖత్ జరీన్… కాంస్యంతో మరో ఘనత

by Ramesh Naini |

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు క్రీడా పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించిన పోలీస్ అధికారులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు.

మంగోలియా వేదికపై మెరిసిన నిఖత్ జరీన్… కాంస్యంతో మరో ఘనత
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు క్రీడా పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధించిన పోలీస్ అధికారులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు. బాక్సింగ్ రింగ్‌లో డీఎస్పీ, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్.. మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తాను చాటారు. మంగోలియా రాజధాని ఉలాన్‌ బాటర్‌లో ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచి కాంస్య పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా నిఖత్‌ జరీన్‌ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

అలాగే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, తెహ్రీ లేక్ వేదికగా ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించిన 25వ ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ పోటీల్లో రాష్ట్ర పోలీసులు విశేష ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పోలీసులు పాల్గొన్న ఈ పోటీల్లో.. రోయింగ్ కాక్స్‌లెస్ పెయిర్ 500 మీటర్ల విభాగంలో ఒకటో బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎన్. రామకృష్ణ, సిద్దిపేట సీఏఆర్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ జె. రాజు రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఈ విజేతలను సైతం డీజీపీ శివధర్ రెడ్డి సత్కరించి, ప్రోత్సహించారు.

Next Story