టీజీ: NFDB కార్యాలయం తరలింపు లేదు.. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ క్లారిటీ

by Prasad Jukanti |

రాజేంద్రనగర్‌లోని ఎన్ఎఫ్‍డీబీ కార్యాలయం తరలింపు ఉండదని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ స్పష్టం చేశారు.

టీజీ: NFDB కార్యాలయం తరలింపు లేదు.. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజేంద్రనగర్‍లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‍మెంట్ బోర్డు (NFDB) కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యాలయాన్ని తరలించే ప్రతిపాదన ఏది లేదని ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో రాజేంద్రనగర్‌లోని ఎన్‍ఎఫ్‍డీబీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయం తరలించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వాకిటి శ్రీహరి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

న్యాయమైన వాటా కల్పించండి:

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో పశుసంవర్ధక, పాడి, మత్స్య రంగాల్లో అమలు చేస్తున్న పలు పథకాలు, వాటి ఫలితాలను రాజీవ్ రంజన్ సింగ్‌‍కు వివరించారు. ఈ రంగాలకు కేంద్రం నుంచి నిరంతర సహకారం అందించాలని కోరారు. అలాగే ఆక్వాకల్చర్‌కు మద్దతు, లైఫ్ సైన్సెస్‌లో ఇన్సూరెన్స్ కవరేజ్, మోపెడ్లు వంటి వనరుల పంపిణీలో న్యాయమైన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులను సమానంగా పంపిణీ చేయాలని మంత్రి శ్రీహరి కోరారు. గత ప్రభుత్వం తెలంగాణకు కేంద్ర నిధులను సమర్థవంతంగా తీసుకురావడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న 46 వేల ప్రధాన చెరువులు, 26 వేల చిన్న చెరువులు మరియు 100 రిజర్వాయర్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

Next Story