న్యూస్‌పేపర్‌లో ఆహారం.. క్యాన్సర్‌కు ఆహ్వానం!

by Naga Rani Yarlagadda |

వేడివేడి ఇడ్లీలు, బజ్జీలు, పునుగులు, సమోసాలను న్యూస్‌పేపర్లలో ప్యాక్ చేసి ఇవ్వడం మన దగ్గర సర్వసాధారణం.

న్యూస్‌పేపర్‌లో ఆహారం.. క్యాన్సర్‌కు ఆహ్వానం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేడివేడి ఇడ్లీలు, బజ్జీలు, పునుగులు, సమోసాలను న్యూస్‌పేపర్లలో ప్యాక్ చేసి ఇవ్వడం మన దగ్గర సర్వసాధారణం. అయితే, చదవడానికి ఉపయోగించే పేపర్లను తినే తిండికి చుట్టడం వల్ల ఊహించని ఆరోగ్య నష్టాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వార్తాపత్రికలలో ఆహార పదార్థాల సరఫరాను నిషేధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆహార భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణలోనూ ఈ తరహా నిషేధాన్ని తీసుకొస్తే ప్రజారోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పేపర్ ఇంక్‌తో ముప్పు

వార్తాపత్రికల ముద్రణకు ఉపయోగించే ఇంకులో ప్రమాదకర రసాయనాలు, భార లోహాలు ఉంటాయి. పేపర్ ఇంక్‌లో ఉండే లెడ్, కాడ్మియం, గ్రాఫైట్ వంటివి వేడి ఆహార పదార్థాలు తగలగానే కరిగిపోతాయి. ఇవి ఆహారంతోపాటు శరీరంలోకి చేరి కాలేయం, కిడ్నీలను దెబ్బతీస్తాయి. ముద్రణ సిరాలో వాడే ఆప్టికల్ బ్రైట్నర్స్, డై-ఐసోబ్యూటైల్ థాలేట్ వంటి రసాయనాలు జీర్ణక్రియను అస్తవ్యస్తం చేయడమే కాకుండా, దీర్ఘకాలంలో క్యాన్సర్ (ముఖ్యంగా ఊరిపిరితిత్తులు, మూత్రపిండాల క్యాన్సర్)కు దారితీస్తాయి. ఈ కెమికల్స్ శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. పిల్లల్లో శారీరక ఎదుగుదల లోపాలు, గర్భిణుల్లో పురిటి నొప్పుల సమస్యలకు కారణమవుతాయి.

సేఫ్ ఫుడ్.. హెల్తీ మహారాష్ట్ర

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా న్యూస్‌పేపర్లలో ఫుడ్ ప్యాకింగ్‌ను ఎప్పుడో నిషేధించింది. మహారాష్ట్ర కంటే ముందే కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ నిబంధనను కఠినంగా అమలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలలో కూడా దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. తాజాగా మహారాష్ట్రలో వార్తాపత్రికలు లేదా ప్రింటెడ్ పేపర్లలో ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం, వడ్డించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ‘సేఫ్ ఫుడ్, హెల్తీ మహారాష్ట్ర’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనలను కఠినతరం చేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్లు, క్యాటరర్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లన్నింటికీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

తెలంగాణలో అమలు చేస్తే..

రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి చాలా ఎక్కువ. వేడి వేడి బజ్జీలు, పకోడీలు, వడలు, పూరీలు, దోసె... ఇలా ఒక్కటేమిటీ అన్నింటినీ న్యూస్ పేపర్లలో ప్యాకింగ్ చేస్తారు. అందుకే పాత న్యూస్ పేపర్ కు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ న్యూస్ పేపర్లలో ఫుడ్ ప్యాకింగ్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే దీనిపై కఠిన నిబంధనలను తీసుకువచ్చి నిషేధం విధిస్తే రోడ్డు పక్కన టిఫిన్లు, స్నాక్స్ తినే సామాన్య, మధ్యతరగతి ప్రజలు తెలియకుండానే కెమికల్స్ బారిన పడకుండా కాపాడవచ్చు. క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల నియంత్రణకు అవకాశం ఏర్పడుతుంది. ఆహార భద్రతపై అవగాహన ఏర్పడి వ్యాపారుల్లో బాధ్యత పెరుగుతుంది.

తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి

- ప్రొఫెసర్ సీఎస్. ముజీబుద్దీన్, ప్రముఖ ఫార్మకాలజిస్ట్

న్యూస్‌పేపర్ ముద్రణకు వాడే ఇంకులో సీసం వంటి భార లోహాలు, మినరల్ ఆయిల్స్, ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వేడి, నూనెతో కూడిన ఆహారం ఈ కాగితాలపై ఉంచినప్పుడు ఆ రసాయనాలు కరిగి ఆహారంలోకి చేరుతాయి. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా, కాలేయం, మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యతతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా, రవాణా సమయంలో అనేక చేతులు మారడం వల్ల ఈ పేపర్లకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు అంటుకుని మైక్రోబియల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు దీనివల్ల త్వరగా అనారోగ్యం బారిన పడతారు. కేవలం ఆమోదిత ఫుడ్-గ్రేడ్ ప్యాకింగ్ మెటీరియల్స్ (బటర్‌పేపర్, ఫుడ్-గ్రేడ్ బ్రౌన్ పేపర్ బ్యాగ్స్, అల్యూమినియం ఫాయిల్, ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్స్, అరటి ఆకులు వంటివి) మాత్రమే వాడాలి.

Next Story