ఆర్టీసీ సమ్మె పరిష్కరించకుండా కాలయాపన తగదు : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-24 15:26:17  IST  )

ఆర్టీసీ సమ్మె పరిష్కరించకుండా కాలయాపన తగదు : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు
X
  • ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలి

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాల్సింది పోయి కమిటీల పేరుతో కాలయాపన చేసి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన పోరుబాట చివరకు సమ్మెకు దారితీసి, రాష్ట్రంలో పరిస్థితిని ఆందోళనకరంగా మార్చిందని మండిపడ్డారు. ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం ఎంతో కలచివేసిందని, ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మరణించడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చకపోవడం, సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ దారుణ పరిస్థితి ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలి. ఆర్టీసీ కార్మికులు ముందుగానే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరం, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు సమ్మెకు దిగినప్పుడు తమ పార్టీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సూచించారు.

ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ది ప్రభుత్వ హత్య : ఎంపీ డా. లక్ష్మణ్​

ఆర్టీసీ కార్మికుల ఆవేదన ఈ స్థాయికి చేరుకోవడం చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంకార పాలనకు నిదర్శనమన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరించడం, మానసిక వేదనకు గురిచేయడం రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యానికి పరాకాష్ట. ఎన్నికల ముందు 'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, సర్కారు ఉద్యోగులుగా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట తప్పి ఎందుకు మొహం చాటేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. 32 న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. ఉచిత బస్సు పథకం బకాయిలు వెంటనే ఆర్టీసీకి విడుదల చేయాలి. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. అణచివేత రాజకీయాలు మానుకుని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరంచి, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక సోదరులు ఎవరు అధైర్యపడవద్దని, ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకొని తమ కుటుంబాలను రోడ్డున పడేయవద్దన్నారు. ప్రాణం తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదు. మీ హక్కుల కోసం బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

Next Story