- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్కారు దవాఖానాల్లో కొత్త శకం.. అడ్మినిస్ట్రేషన్లకు పెద్దపీట
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇకపై ఆస్పత్రుల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను వేరువేరుగా నిర్వహించాలని భావిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, పాలనాపరమైన సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై ఆస్పత్రుల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను క్లినికల్ సేవల నుంచి పూర్తిగా వేరు చేయాలని సర్కారు భావిస్తోంది. వైద్యులు రోగులకు చికిత్స అందించడంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా, అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను ప్రత్యేక నిపుణులకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైద్య విధాన పరిషత్, డీఎంఈ పరిధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆస్పత్రి నిర్వహణలో డాక్టర్ల ప్రమేయాన్ని తగ్గించి, ఎండీ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) నిపుణులు లేదా ప్రత్యేక అధికారులను నియమించడం ద్వారా పేదలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఆస్పత్రి పాలనను క్లినికల్ సేవల నుంచి వేరు చేస్తూ, ప్రత్యేక అధికారులకు అప్పగించాలనే ప్రతిపాదనపై సీఎం అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు.
ప్రత్యేక అధికారుల నియామకం
అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్పెషలిస్ట్ వైద్యులు కేవలం రోగులకు చికిత్స అందించడంపైనే దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘పెద్ద డాక్టర్లు ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ను కూడా చూడాల్సి రావడంతో వారి నైపుణ్యం వృథా అవుతోంది. నర్సులు వచ్చారా? స్వీపర్లు ఉన్నారా? పార్కింగ్ సరిగ్గా ఉందా? క్యాంటీన్‌లో ఏం జరుగుతోంది? వంటి అంశాలను డాక్టర్లు పర్యవేక్షించడం వారి టెంపర్‌మెంట్‌కు సెట్ కావడం లేదు’ అని పేర్కొన్నారు. వైద్యులకు హాస్పిటల్ నిర్వహణ బాధ్యత అప్పగించడం వల్ల వైద్యంపై దృష్టి సారించలేని పరిస్థితులు ఉంటున్నాయని భావించిన ప్రభుత్వం.. పేదలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ఆస్పత్రుల నిర్వహణ విధానంలోనూ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. అందుకే నిర్వహణ విభాగాన్ని వేరు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలు ఇవే..
ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను ఇకపై గ్రూప్-1 లేదా గ్రూప్-2 స్థాయి అధికారులకు గానీ, ఎండీ(హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) వంటి ప్రత్యేక నిపుణులకు గానీ అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా బోధనా ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విరివిగా అందించడం ద్వారా అక్కడ చదివే పీజీ విద్యార్థులకు, హౌస్ సర్జన్లకు మెరుగైన ప్రాక్టికల్ అనుభవం లభిస్తుందని సర్కారు భావిస్తోంది. వైద్యులకు ఆస్పత్రి నిర్వహణ బాధ్యతల నుంచి విముక్తి కల్పించడమే కాకుండా, సర్జరీలు చేసే వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచనను వైద్యులు స్వాగతిస్తున్నారు. అయితే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను గ్రూప్స్ అధికారులకు కాకుండా ఎండీ(హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) వారికే అప్పగించాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం కచ్చితంగా హాస్పిటల్స్‌లో ఇతర శాఖలకు చెందిన అధికారుల ప్రమేయాన్ని ముమ్మాటికీ అంగీకరించబోమని చెబుతున్నారు.
డీఎంఈ పరిధిలో పాలసీ మార్పులు
గతంలో ఆస్పత్రి పరిపాలన కోసం ప్రత్యేక కోర్సులు లేకపోవడంతో ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్ వంటి పదవులను సీనియర్ వైద్యులే నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా శిక్షణ పొందిన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు అందుబాటులో ఉండటంతో డీఎంఈ పరిధిలో త్వరలోనే నియామక ప్రక్రియలో మార్పులు రానున్నాయి. దీనివల్ల అటు రోగులకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు, ఇటు ఆస్పత్రి నిర్వహణలోనూ జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.






