రామచంద్రా!… ఎన్నికల వేళ టీ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

by Prasad Jukanti |   (  Updated:2025-10-05 11:15:37  IST  )

తెలంగాణ బీజేపీలో మరోసారి సమన్వయలోపం బహిర్గతం

రామచంద్రా!… ఎన్నికల వేళ టీ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నేతల మధ్య సమన్వయలోపం బహిర్గతం అయింది. జూబ్లీహిల్స్ బై పోల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇవాళ హైదరాబాద్‍లోని స్టేట్ ఆఫీస్‍లో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకత్వం తీరు, పార్టీ నేతల తీరుపై ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ పార్టీ అంతా సమిష్టిగా ఉందని నిరూపించుకోవాల్సిన సమయంలో అగ్రనేతలంతా ఇలా అసంతృప్తి వెళ్లగక్కడంతో రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

పార్టీనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు?:

బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమం డిసైడ్ చేస్తారు కాని క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. సమావేశాలకు రావడం.. వెళ్లడమే మా పనా? క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఏవని ప్రశ్నించారు. రాష్ట్రలో పార్టీనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్టీ నేతల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక రంగారెడ్డి, వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక సరైన నేతలకే ఇన్ చార్జి బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.

ఇదేం పని..:

రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందు నుంచి రాష్ట్ర బీజేపీలో గ్రూప్ తగాదాలు ఉన్నాయనే ఊహాగానాలు గుప్పుమంటూనే ఉన్నాయి. పార్టీ అధ్యక్ష పదవిపై అనేక మంది ఆశలు పెట్టుకున్నా అధిష్టానం మాత్రం రామచందర్ రావు (Ramachander Rao) పేరును ఖారురు చేసింది. దీంతో ఈ కలహాలు అన్ని పోయి పార్టీ గాడిన పడుతుందని అంతా భావించారు. కానీ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు బాధ్యతలు చేపట్టి మూడు నెలలు గడుస్తున్న పార్టీల్లో లుకలుకలు మాత్రం పోలేదు. మళ్లీ కథ అన్న చందగా నేతలు లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తాజా సమావేశంలో వెల్లడైందనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బై పోల్ పై ఆ పార్టీ క్యాడర్ గంపెడాశలు పెట్టుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన క్యాడర్ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతోంది. పార్టీ నేతల గెలుపు కోసం కృషి చేసిన మేము ఇప్పుడు బరిలో ఉందామనే ఆలోచనలో ఉండగా అగ్రనేతలు ఇలా కీచులాడుకోవడం చూసి రామచంద్రా.. ఇదేం పని అంటూ పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాము గెలిచాము ఇక మాకేం పని అన్నట్లు కాకుండా ఇకనైనా క్యాడర్‍ను గెలిపించే బాధ్యత పార్టీ అగ్రనేతలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి తెలంగాణ బీజేపీ నేతలంతా ఈ అసంతృప్తులను వీడి ఒక్కటిగా కలిసి నడుస్తారా లేక ఇలాగే విభేదించుకుంటూ ముందుకు సాగుతారా అనేది కాలమే నిర్ణయించనుంది.

Next Story