ఉదయం నోటిఫికేషన్.. సాయంత్రానికి స్టే.. ఆశావహులకు కొత్త టెన్షన్

by Prasad Jukanti |   (  Updated:2025-10-09 11:55:25  IST  )

స్థానిక ఎన్నికల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆశావహులకు హైకోర్టు బ్రేక్ వేసింది.

ఉదయం నోటిఫికేషన్.. సాయంత్రానికి స్టే.. ఆశావహులకు కొత్త టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక ఎన్నికల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆశావహులకు హైకోర్టు (Telangana High Court) బ్రేక్ వేసింది. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇవాళ ఉదయమే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ ఉదయం నోటిఫికేషన్ వెలువడటంతో రిజర్వేషన్లు అనుకూలం ఉన్న ఆశావహులంతా ఆయా స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు అంతా సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో సాయంత్రానికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9పై కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కోర్టు ఆర్డర్ వచ్చాక ఈసీ నిర్ణయం:

స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే తాజాగా కోర్టు ఈ నోటిఫికేషన్‍పై స్టే విధించడంతో.. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పాటించేందుకు ఎస్ఈసీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఆశావహులకు కొత్త టెన్షన్:

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల నోటిఫికేషన్ పై కోర్టు స్టే విధించడంతో ఇప్పుడు ఖరారైన నోటిఫికేషన్లే ఎన్నికలు జరిగే నాటికి ఉంటాయా లేదా అనే టెన్షన్ ఆశావహుల్లో వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లు తెలియక ముందు పోటీ విషయంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కొత్త రిజర్వేషన్లు ఖరారై పక్షం రోజులవుతోంది. దీంతో తమకు రిజర్వేషన్లు సానుకూలంగా వచ్చిన చోట్ల ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో కొంత మేర ఖర్చు పెట్టుకున్నారు. అంతిమంగా జీవో నంబర్ 9 చెల్లదని కోర్టు తీర్పు వెలువరిస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అనే ఆందోళనలు బీసీలతో పాటు మిగతా సామాజిక వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో చివరాఖరుకు ఏం జరగబోతోందనేది వేచి చూడాలి.

Next Story