ఎక్స్‌అఫిషియో ఓట్లకు నయా రూల్.. నియోజకవర్గంలోనే ఓటు వేసేలా చర్యలు

by Kema Shiva Kumar |

మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు ఒక ఎత్తు అయితే.. మేయర్, చైర్మెన్ ఎన్నికలు మరో ఎత్తు.

ఎక్స్‌అఫిషియో ఓట్లకు నయా రూల్.. నియోజకవర్గంలోనే ఓటు వేసేలా చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు ఒక ఎత్తు అయితే.. మేయర్, చైర్మెన్ ఎన్నికలు మరో ఎత్తు. ఎన్నికల ఫలితాల తర్వాత మెజార్టీ వార్డులను దక్కించుకున్న పార్టీనే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్‌లను కూడా దక్కించుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. కానీ ఈ సభ్యుల ఓటు వినియోగంపై ఎన్నికల సంఘం కొత్త రూల్ తీసుకురావాలని నిర్ణయించింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోనుంది.

ఆ పరిధిలోనే ఓటేయ్యాలి..

మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్‌ల ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్ సభ్యులు, రాజ్యసభ సభ్యుల (ఎక్స్ అఫిషియో సభ్యులు) ఓటు హక్కు వినియోగం కీలకంగా మారనుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ ఓటు మున్సిపాలిటీలో ఉంటే అక్కడే, లేదా గ్రామంలో ఉంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎక్స్ అఫిసియో సభ్యునిగా ఓటు వేయొచ్చు. లోక్ సభ్యులకు సైతం నియోజకవర్గం పరిధిలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలోనైనా ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు వేయొచ్చు. రాజ్య సభ్యులకు అయితే రాష్ట్రంలో ఎక్కడైనా ఓటెయ్యడానికి అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు.

గతేడాది గందరగోళం..

గత మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు లేకపోయినా ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను ఆయుధంగా చేసుకోని పాలకవర్గాలను కైవసం చేసుకున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని నిర్ణయించారు. ముఖ్యంగా నగర శివారుప్రాంతాల్లోని తుక్కుగుడలో బీఆర్ఎస్‌కు ఒక్కరే వార్డు సభ్యులు గెలిచారు. కానీ నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను ఉపయోగించుకుని చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవులను దక్కించుకున్నారు. ఆదిభట్లలోనూ ఇదే పరిస్థితి. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.

కొత్త మార్గదర్శకాలు..

మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్‌ల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు) ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు రెడీ చేస్తోంది. ఎవరు ఎక్కడ? ఎలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలో స్పష్టంగా తెలియజేయనుంది. గతంలో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో కొత్త మార్గదర్శకాలను వెల్లడించనున్నారు. అందులో భాగంగానే ఎక్స్ అఫిషియో సభ్యుల వివరాలివ్వాలని జిల్లా కలెక్టర్లను కోరిన విషయం తెలిసిందే. వివరాలతోపాటు సదరు ఎక్స్ అపిషియో సభ్యుని ఓటు ఎక్కడా వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం మార్గదర్శకాల జారీ తర్వాత స్పష్టత రానుంది.

Next Story