- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాణ వ్యర్థాలపై సర్కార్ ఉక్కుపాదం.. అక్రమ డంపింగ్‌కు చెక్
క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఏరియాల్లో నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఏరియాల్లో నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు ప్రభుత్వ ప్రాజెక్టుల్లో 10 శాతం రీసైకిల్డ్ మెటీరియల్ ను తప్పనిసరిగా వినియోగించాలని డిసిషన్ తీసుకున్నది. దీనికి సంబంధించి మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రోడ్లు, నాలాలు, చెరువుల వద్ద వ్యర్థాలను కుప్పలు పోయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, పట్టణ ముంపు (అర్బన్ ఫ్లడింగ్)నకు ప్రధాన కారణమవుతోందని గుర్తించిన సర్కారు.. ఇకపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ‘నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2025’ను పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయని, అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు వాహనాల సీజ్, కాంట్రాక్టర్ల బ్లాక్ లిస్టింగ్ వంటి చర్యలు తప్పవని హెచ్చరించింది.
వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాన్ తప్పనిసరి
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. ఇకపై భవన నిర్మాణ అనుమతులు కావాలన్నా, కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ రావాలన్నా ‘వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక’ (వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాన్) సమర్పించడం తప్పనిసరి. కేవలం ప్రణాళిక ఇస్తే సరిపోదు.. సదరు వ్యర్థాలను ప్రభుత్వం గుర్తించిన అధీకృత రీసైక్లింగ్ ప్లాంట్లకు మాత్రమే తరలిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ వ్యర్థాలను సక్రమంగా తరలించినట్లు ధ్రువీకరణ పత్రం చూపిస్తేనే మున్సిపల్ అధికారులు ‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్’ జారీ చేయనున్నారు. లేనిపక్షంలో సదరు భవనానికి అనుమతులు నిలిపివేస్తారు. అలాగే, రోడ్డు కటింగ్ పర్మిషన్లు తీసుకునే వారు కూడా వ్యర్థాల తరలింపుపై రీసైక్లింగ్ సంస్థలతో ముందే ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
10 శాతం తప్పనిసరి
ప్రభుత్వ ప్రాజెక్టుల్లో నిర్మాణ వ్యర్థాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సర్కారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లోనూ కనీసం పది శాతం మేర రీసైకిల్ చేసిన వ్యర్థాల మెటీరియల్‌ను వాడటం తప్పనిసరి చేసింది. 20 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే భారీ ప్రైవేటు ప్రాజెక్టుల్లోనూ రీసైకిల్డ్ మెటీరియల్ వాడకాన్ని తప్పనిసరి చేశారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పైపులైన్లు, ఫుట్‌పాత్ టైల్స్, పార్కుల ప్రహరీల వంటి పనుల్లో ఈ మెటీరియల్‌ను వినియోగించాలి. ముఖ్యంగా కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన తర్వాత ‘సీ అండ్ డీ వేస్ట్ డిస్పోజల్ సర్టిఫికెట్’ సమర్పిస్తేనే వారి తుది బిల్లులు చెల్లించాలని, అప్పటివరకు పనులను క్లోజ్ చేయవద్దని అన్ని విభాగాల ఇంజినీరింగ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల అమలులో ఎక్కడా అలసత్వం వహించకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెట్రో రైల్, జలమండలి, హైడ్రా, టీజీఐఐసీ వంటి అన్ని కీలక విభాగాల అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని ప్రభుత్వం పేర్కొంది. నిబంధనల అమలు విషయంలో అడ్డుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం నగర శివార్లలోని శంషాబాద్, తుంకుంట, జీడిమెట్ల, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లనే వినియోగించుకోవాలని సూచించింది. ప్రతి నెలా తాము చేపట్టిన పనులు, ఉత్పత్తయిన వ్యర్థాలు, తరలింపు వివరాలపై అన్ని శాఖలు నివేదికలు సమర్పించాలని పేర్కొంది.






