14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. నిఘా పెట్టాలంటున్న ప్రజలు

by Naga Rani Yarlagadda |

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. నిఘా పెట్టాలంటున్న ప్రజలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కొత్తరేషన్​కార్డుల పంపిణీ కార్యక్రమం ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్​ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభలు, మీసేవా ద్వారా రేషన్ కార్డుల కోసం 25 లక్షల దరఖాస్తులు రాగా, అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాల మార్పులు చేర్పులు జరిగాయి. మిగతావి కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే. ఇంటింటి పరిశీలన చేసిన అధికారులు 13 లక్షల మంది కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. అనంతరం 2.55 లక్షల కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా నిర్దారించారు. వీరికి 14న సీఎం రేవంత్ కార్డు మంజూరు పత్రాలను అందజేయనున్నారు.

స్మార్ట్ కార్డులు, బార్ కోడ్

రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం సందర్బంగా స్మార్ట్​కార్డులు ఇవ్వాలని అప్పట్లో సీఎం రేవంత్​ప్రకటన చేశారు. సరికొత్తగా బార్​కోడ్‌తో ఈజీ యాక్సెస్​చేసేలా రూపొందిస్తామని బహిరంగ సభలో తెలిపారు. దీంతో పౌరసరఫరాల అధికారులు డిజిటల్ కార్డులకు సంబంధించిన నమూనాల కోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి పరిశీలన చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఒక వైపు సీఎం రేవంత్, మరోవైపు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఫోటోలు.. మధ్యలో ప్రభుత్వ లోగో ఉండేలా డిజైన్​సిద్ధం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అది కాస్త పెండింగ్ పడింది. దీనికి సంబంధించిన కేసు కూడా ఈనెల 7న బెంచ్ మీదకు రానుంది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు.

దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం

గత ప్రభుత్వాలు రేషన్ కార్డు మీద గతంలో దొడ్డు బియ్యం సప్లయ్ చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని చెప్పారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే ఏటా ప్రభుత్వానికి రూ.5,400 కోట్ల భారం పడేది. సన్నబియ్యం పంపిణీతో మరో రూ.3 వేల కోట్ల అదనపు భారం పడుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి మొగ్గు చూపడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ కార్డుల్లో కోత..

ఇప్పటివరకు అక్రమంగా కార్డులు కలిగి ఉన్నవారితో పాటు గత ఆరేడు నెలలుగా రేషన్​దుకాణాల వైపు రాని లబ్దిదారులను గుర్తించి వారి కార్డులను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత జూన్‌లో మరణించిన వారిని, అడ్రస్సులో అందుబాటులో లేని వారి పేర్లను తొలగించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం జిల్లా అధికారులకు అనర్హుల జాబితా పంపించడంతో వారి తమ పనిని పూర్తిచేశారు. దసరా వరకు నగరంలో రూ.2 లక్షల ఆదాయం, గ్రామాల్లో రూ.1.50 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారిని గుర్తించి కార్డులను తొలగించనున్నారు.

దరఖాస్తుల పరిశీలనలో అధికారుల చేతివాటం..

మొన్నటివరకు కార్డులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన లంచం ఇస్తే ఎలాంటి నిబంధనలు లేకుండా స్థానిక అధికారులు ఆన్​లైన్​యాప్​ద్వారా అర్హులేనని రిపోర్టు పంపారు. వారిని తృప్తి పరచకపోతే కార్డుల విషయంలో సవాలక్ష కొర్రీలు పెడుతూ నిజమైన అర్హులకు రాకుండా కుట్రలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక నుంచి కార్డుల పరిశీలన పారదర్శకంగా జరిగే విధంగా ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని పేదప్రజలు కోరుతున్నారు. ఇదిలాఉండగా, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు లోకల్​అధికారుల జేబులు నింపుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story