- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'క్యూర్' పరిధిలో కొత్త పైపులైన్ వ్యవస్థ.. 2047 లక్ష్యంగా జలమండలి భారీ కసరత్తు!
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ‘క్యూర్’ పరిధిలో తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతలను టాటా కన్సల్టెన్సీకి అప్పగించారు. దీంతోపాటు మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన సర్వే పనులు సైతం ప్రారంభమయ్యాయి.
600 ఎంజీడీలు సరఫరా
ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. జలమండలి పరిధిలో 14 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 11 లక్షల కనెక్షన్లు ఉచిత తాగునీటి సరఫరా స్కీమ్‌లోనే ఉన్నాయి. 2030 వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో.. అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2,3 లను రూపకల్పన చేసింది. 2027 సంవత్సరం వరకు.. హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతుంది. 2047 నాటికి ఈ సంఖ్య 1,114 ఎంజీడీలుగా ఉండనుంది.
15 వేల కిలోమీటర్ల పైపులైన్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) పరిధిలో సుమారు 15,000 కిలోమీటర్లకుపైగా తాగునీటి సరఫరా పైపులైన్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. నగరవ్యాప్తంగా నిరంతరాయంగా నీటిని సరఫరా చేయడానికి కృష్ణా, గోదావరి, సింగూర్, మంజీరా ప్రాజెక్టుల నుంచి నీటిని ఈ పైపులైన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు 1400 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న పరిధి 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే తాగునీటి సరఫరా వ్యవస్థ ఉన్నది. కానీ ఈ పైపులైన్ వ్యవస్థను ప్రణాళిక లేకుండా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సీవరేజ్ లైన్, తాగునీటి సరఫరా పక్కనే ఉండడంతో తరుచుగా లీకేజీ కారణంగా కలుషిత నీటి సమస్యలు పెరుగుతున్నాయి. పాత పైపులైన్ల కారణంగా లేకేజీ సమస్యలు పెరుగుతున్నట్టు గుర్తించారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది.
‘క్యూర్’ పరిధిలో..
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధి 2,053 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. అయితే పాత జీహెచ్ఎంసీ ఏరియాలో మాత్రమే తాగునీటి సరఫరా పైపులైన్ వ్యవస్థ ఉన్నది. జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీల్లో తాగునీటి వ్యవస్థ నామమాత్రంగానే ఉన్నది. వీటి పరిధిలో ప్రస్తుతం తాగునీటి సరఫరాను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా వ్యవస్థను జలమండలికి అప్పగించనున్నారు. అనంతరం క్యూర్ పరిధిలో 2,053 చదరపు కిలోమీటర్ల ఏరియాలో కొత్త తాగునీటి సరఫరా పైపులైన్ వ్యవస్థకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన సర్వే పనులు ప్రారంభమయ్యాయి.






