TG: రెవెన్యూ కార్యాలయాలకు మహర్దశ: శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు.

TG: రెవెన్యూ కార్యాలయాలకు మహర్దశ: శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. ఈ భ‌వ‌నాల‌ను హౌసింగ్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో నిర్మించాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. గురువారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్‌ కుమార్, స్టాంప్స్& రిజిస్ట్రేషన్ ఐ.జి. రాజీవ్ గాంధీ హ‌నుమంతు, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌత‌మ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్, ఆర్డీవో, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిధిలావ‌స్థ, పాల‌న‌కు అనువుగా లేని భ‌వ‌నాలు వివ‌రాలను సేకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. మొద‌టి ద‌శ‌లో అద్దె భావనాలల్లో, శిథిలావస్థాలో ఉన్న 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే అవ‌స‌ర‌మైన చోట్ల మ‌ర‌మ్మతులు చేప‌ట్టడానికి నివేదిక‌లు అందించాల‌ని రెవెన్యూ సెక్రట‌రీని ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించి నిర్మాణ పనులు వీలైనత త్వరితగతిన ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామని చెప్పారు. త‌క్కువ ఖ‌ర్చుతో ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందేలా ఈ భ‌వ‌నాల నిర్మాణం ఉంటుంద‌న్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన త‌ర్వాత కూడా రెవెన్యూ కార్యాల‌యాలు ప్రజ‌ల‌కు సౌక‌ర్యవంతంగా లేక‌పోవ‌డంతోపాటు చాలా వ‌ర‌కు అద్దె భ‌వ‌నాల‌లోనే కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళికాబద్ధత లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించింద‌ని మంత్రి విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో ఇప్పటికే సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పఠాన్ చెరువు, కోహెడ లలో భవనాలకు శంకుస్థాపన చేసుకొని పనులు కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు.

జిల్లా నియోజక వర్గ కేంద్రాలల్లో ఉన్న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు సంబంధించి డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ సంఖ్యకు అనుగుణంగా భ‌వ‌నాలు నిర్మిస్తామ‌ని వెల్లడించారు. రెండు డీఐజీ, నాలుగు జిల్లా స‌బ్ రిజిస్ట్రార్, 52 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను నాలుగు వేల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి ప‌ది వేల చ‌ద‌ర‌పు అడుగులు ఉండేలా ఒకే నమూనాలో నిర్మించాబోతున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని త్వరలోనే క్యూర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నామని వెల్లడించారు.

Next Story