మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సంచలనం.. 614 మార్కులతో ఇంటర్‌ పాస్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-11 12:27:04  IST  )

గన్ను వదిలి పెన్ను పట్టిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఇంటర్ పరీక్షల్లోనూ సత్తా చాటారు.

మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సంచలనం.. 614 మార్కులతో ఇంటర్‌ పాస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆయుధాల మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ చదువులోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. చదువుకోవాలనే తన బలమైన సంకల్పంతో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆయన అద్భుత ప్రతిభ చాటారు. గతంలో అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన తన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షను ఇటీవల విడుదలైన ఫలితాల్లో దేవ్‌జీ విజయవంతంగా పూర్తి చేశారు. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ ఆయన ఈ పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలలో ఆయన తెలుగు సబ్జెక్టులోనే ఏకంగా 72 మార్కులు సాధించి 614 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

లాసెట్‌లోనూ సత్తాచాటిన కామ్రేడ్..

దేవ్‌జీ కేవలం ఇంటర్‌కే పరిమితం కాలేదు. న్యాయశాస్త్రం (Law) చదివి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన ఇటీవల రాసిన లాసెట్ (LAWCET) పరీక్షలోనూ సంచలన విజయం సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఏకంగా 349వ ర్యాంక్ కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు అడవుల్లో తుపాకీ పట్టి తిరిగిన అగ్రనేత.. నేడు చట్టం, విద్యపై గౌరవంతో పెన్ను పట్టి వరుస విజయాలు సాధించడం పట్ల విద్యాశాఖ, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర సన్నిహితుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

Next Story