ధాన్యం కొనుగోళ్లలో కొత్త మైలు రాయి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Muthe.Rajitha |

రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో కొత్త మైలురాయిని అధిగమించిందని, ఖరీఫ్ సీజన్‌లో 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో కొత్త మైలు రాయి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లలో కొత్త మైలురాయిని అధిగమించిందని, ఖరీఫ్ సీజన్‌లో 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో కొనుగోలు చేసిన 3.94 లక్షల మెట్రిక్ టన్నుల కంటే రెండింతలు ఎక్కువ సేకరణ చేసినట్లు వెల్లడించారు.

సోమవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు , పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని ఆదేశించారు. రాష్ట్రం ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రికార్డు నెలకొల్పిందని తెలిపారు.

దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఖరీఫ్ సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందన్నారు. ఇది తెలంగాణ వ్యవసాయ రంగ బలాన్ని, రైతుల పట్ల మా ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఇప్పటి వరకు 3.95 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 4.59 లక్షల మెట్రిక్ టన్నుల పెద్ద ధాన్యం కొనుగోలు చేసినట్లు, కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతుల సంఖ్య గత సంవత్సరం 55,493 మందిగా ఉండగా, ఈ ఏడాది 1,21,960 మందికి చేరిందని చెప్పారు.

మొత్తం ధాన్యం కొనుగోలు విలువ రూ. 2,041.44 కోట్లు కాగా, ఇది గత సంవత్సరం రూ. 915.05 కోట్లతో పోలిస్తే రెట్టింపు ఉందన్నారు. ఇందులో రూ. 832.90 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగిలిన రూ. 1,208.54 కోట్లు ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) ద్వారా నమోదు తర్వాత 48 గంటల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. సన్నాల బోనస్ గత సంవత్సరం రూ. 43.02 కోట్ల నుండి ఈ సంవత్సరం రూ. 197.73 కోట్లకు పెరిగిందని, అందులో రూ. 35.72 కోట్లు ఇప్పటి వరకు చెల్లించామన్నారు. రైతులకు సమయానికి చెల్లింపులు చేయడమే కాకుండా, తగిన నిల్వలు, రవాణా సదుపాయాలు కల్పించి, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

మొంథో తుఫాన్ నుండి రైతులు కొంతవరకు కోలుకుంటున్న సమయంలోనే మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడిందని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, నిల్వ ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా రక్షించేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ప్రతిరోజు వాతావరణ హెచ్చరికలు అందజేయాలని చెప్పారు.

వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని తక్షణమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి, బాయిల్డ్ రైస్ కోటా కేటాయింపుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అదనంగా తగిన గోదాంలు, స్థానిక హమాలీ సిబ్బందిని సమకూర్చి కొనుగోలు ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగించాలని ఆదేశించారు.

తుఫాన్​ కారణంగా 1.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం : తుమ్మల

తుఫాన్ కారణంగా సుమారు 1.10 లక్షల ఎకరాలలో ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన పంటనష్టం నివేదికను కేంద్రానికి పంపామని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొనుగోళ్లు సజావుగా సాగేందుకు ధాన్య తేమ శాతం నిబంధనలను సడలించమని కేంద్రాన్ని అభ్యర్థించామని చెప్పారు.తాము కేంద్రంతో చర్చలు కొనసాగిస్తామన్నారు. వాతావరణ ప్రభావంతో నష్టపోయిన పంటలు రైతులకు నష్టం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Next Story